భారత్ లో ఉంటూనే పాకిస్థాన్‌కు సపోర్ట్.. దేశవ్యాప్తంగా అరెస్ట్ లు
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ భారతావని కసిగా రగిలిపోతోంది. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధం ఏ క్షణం ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ దాడి చేస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా పాకిస్థాన్ భయంతో ఉంది.
ఈ క్రమంలో పహల్గాం ఉగ్రవాద దాడిని సామాజిక మాధ్యమాల్లో సపోర్ట్ చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. పాకిస్థాన్ కు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. పాకిస్థాన్ కు మద్దతుగా పోస్టులు పెట్టిన 36 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టులు జరిగాయి. ఒక్క అసోంలోనే 16 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

తాజాగా భోజ్ పురీ ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గాం ఉగ్రదాడిపై నేహా సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. దీంతో ఆమెపై లక్నో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.
'మతం ఆధారంగా నేహా చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజలను మరో వర్గం వారిపై రెచ్చగొట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ సమగ్రతపైనా ఆమె వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయి' అని అభయ్ అనే వ్యక్తి లక్నో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో లక్నో పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications