ఒడిశాలో ఏపీ ఎన్నికలా ? బీజేపీపై నవీన్ పట్నాయక్ ఫైర్..!
ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతంగా ఉన్న కొటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ కలకలం రేపింది. దీనిపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik ) ఘాటుగా స్పందించారు. ఒడిశా పరిధిలోకి వచ్చే కొటియా గ్రామాల్లో ఏపీ ఎన్నికలు పెడుతుంటే ఏం చేస్తున్నారని అక్కడి బీజేపీ సర్కార్ ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఈ మేరకు కొటియా గ్రామాల నుంచి ఆంధ్రా గో బ్యాక్ అంటూ ఇచ్చిన హామీని నవీన్ గుర్తుచేశారు.
ఒడిశాలో అంతర్భాగమైన 'కోటియా' ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన పరిణామమని నవీన్ తెలిపారు. ఒడిశా సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తక్షణమే తీసుకుంటామని సీఎం మోహన్ చరణ్ మాఝీ ఏపీకి లేఖ రాశారని ఆయన వెల్లడించారు. అయితే తాను సీఎం ఉన్న కాలంలో, ఒడిశా భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు పోరాటం చేశానని, గతంలో బీజేపీ నాయకులు పదేపదే 'కోటియా' ఒడిశాలో భాగమేనని పేర్కొనడమే కాకుండా, "ఆంధ్రా గో బ్యాక్" నినాదాలను కూడా ఇచ్చారని నవీన్ గుర్తుచేశారు.

2024 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోటియా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని, ఒడిశా భౌగోళిక సమగ్రతను కాపాడుతుందని, ఒడియా ప్రజల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చిందని, అదది ఇప్పుడు ఏమైందని నవీన్ ప్రశ్నించారు. ఇవాళ ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం 'కోటియా'లో ఎన్నికలను ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇందులో మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మిత్రపక్షంగా ఉందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండటానికి, అలాగే రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ, భౌగోళిక సమగ్రత విషయంలోనూ రాజీ పడే ధోరణిని కలిగి ఉండటానికి కారణం ఈ రాజకీయ అనివార్యతేనా అని ప్రశ్నించారు. 2025లో ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కోటియా కమిటీ చేసిన సిఫార్సులేంటి, వాటి అమలుకు తీసుకున్న చర్యలు ఏంటని నవీన్ ప్రశ్నించారు. దీనిపై ఒడిశా ప్రజలు స్పష్టమైన సమాధానాలను, జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారన్నారు.














Click it and Unblock the Notifications
