"జనం కోసం ఆలోచించిన నా ఫ్రెండ్స్ జైల్లో"- అభిజీత్ దిప్కే ఎమోషనల్ ట్వీట్..!
ఆన్ లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి, నీట్ అక్రమాల నేపథ్యంలో దాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చి విజయవంతమైన కీలక నేతల్లో అభిజీత్ దిప్కే తర్వాత స్ధానంలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఉంటారు. అయితే ఇందులో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను జంతర్ మంతర్ లో ఆంక్షల్ని ఉల్లంఘించి జాతీయ జెండా ఎగరేసినందుకు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. వారి పిటిషన్లపై విచారణ కూడా ఆలస్యమవుతోంది. దీంతో వారు జైల్లోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మిత్రుడు, సీజేపీ బాస్ అభిజీత్ దిప్కే ఇవాళ ఎమోషనల్ అయ్యారు. జనం కోసం తన మిత్రుల త్యాగాలను ఎక్స్ లో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
కాక్రోచ్ పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇవాళ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను ఉద్దేశించి సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన.. కొన్ని సంవత్సరాల క్రితం, అశు లండన్‌లో అత్యధిక వేతనం లభించే కార్పొరేట్ ఉద్యోగంలో ఉండేవాడని, లక్షలాది రూపాయలు సంపాదించేవారని, సౌరవ్ దేశంలోని న్యాయ వ్యవస్థ గురించి రాస్తూ, ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడని గుర్తుచేసుకున్నారు. వీరిద్దరికీ విజయవంతమైన వృత్తి జీవితాలు, ఆర్థిక భద్రత ఉన్నాయన్నారు. తాము నిర్మించుకున్న ఆ జీవితాలను అలాగే కొనసాగించడానికి వారికి అన్ని కారణాలు ఉన్నాయన్నారు. కానీ, ఈ దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే ఆశతో వారు వాటన్నింటినీ వదిలేశారని, తమ సౌకర్యవంతమైన జీవితాలను వదిలి, వీధుల్లోకి వచ్చి, అనిశ్చితిని ఎదుర్కొని, చివరికి జైలు పాలవ్వాల్సిన అవసరం వారికి ఏమాత్రం లేదన్నారు. అయినా సరే, వారు అలా చేశారన్నారు.

వీరిద్దరిలో తనకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, తాము ఎంతో సౌకర్యవంతమైన నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, అదృష్టం లేని వారి కోసం పోరాడాలని వారు నిర్ణయించుకున్నారని దిప్కే ప్రశంసించారు. వారు సులభంగానే మరోవైపు చూస్తూ, తమ జీవితాలను ఆనందంగా గడపవచ్చని తెలిపారు. తమకు తెలియని వ్యక్తుల కష్టాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండవచ్చన్నారు. ఎవరూ వారిని ఇలాంటి త్యాగాలు చేయమని అడగలేదన్నారు. ఎవరూ వారి నుండి ఇలాంటివి ఆశించలేదని, కానీ వారు అలా చేశారన్నారు. ఎందుకంటే వారికి తమ గురించి మాత్రమే కాకుండా, ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ ఉందన్నారు. తన దృష్టిలో, ఒక మనిషికి ఉండగలిగే అత్యుత్తమ లక్షణం ఇదే అన్నారు. తమకు తెలియని వ్యక్తుల కోసం నిలబడటం, తమవి కాని పోరాటాలను చేపట్టడం, మరొకరికి మెరుగైన జీవితం లభిస్తుందనే ఆశతో తమ దగ్గర ఉన్న సర్వస్వాన్ని పణంగా పెట్టడం అన్నారు. అశు, సౌరవ్ అటువంటి వ్యక్తులంటూ దిప్కే ట్వీట్ ముగించారు.














Click it and Unblock the Notifications
