ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!
జాతీయ స్ధాయిలో నెలకొన్న పరిస్ధితుల్ని ఏపీలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్లో ఎస్ఐఆర్ విషయంలో తలెత్తిన విభేదాలను సొమ్ము చేసుకుంటూ ఈసీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈసీల నియామకాల కోసం 2023లో కేంద్రం పార్లమెంట్ లో చేసిన చట్ట సవరణకు బేషరతుగా మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడు దాన్ని తప్పిదంగా అభివర్ణిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఈ చట్టాన్ని మరోసారి సవరించాలని, ఈసీల నియామక కమిటీలో ప్రధాని, విపక్షనేతతో పాటు సీజేఐ కూడా ఉండాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జగన్ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచితే ఏం జరగబోతోందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది.
ఈసీల చట్ట సవరణకు మద్దతుగా జగన్
2023లో కేంద్ర ఎన్నికల కమిషన్ లో కమిషనర్ల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం పార్లమెంట్ లో ఆ చట్టానికి సవరణలు చేసింది. దీంతో అప్పటివరకూ ఈసీల ఎంపిక కమిటీలో ఉన్న ప్రధాని, విపక్ష నేతతో పాటు ఉండాల్సిన సీజేఐ స్ధానంలో కేబినెట్ మంత్రి వచ్చి చేరారు. ఈ చట్టానికి అప్పట్లో ఎన్డీయే పక్షాలతో పాటు కూటమిలో లేని వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనా విచారణ ముందుకు సాగలేదు. అదే సమయంలో కేంద్రం కొత్త చట్ట ప్రకారం ఈసీల నియామకాలు పూర్తి చేయడం, అలా నియమితులైన ఈసీలు ఎస్ఐఆర్ వంటి వివాదాస్పద నిర్ణయాలతో విపక్షాల ఉసురుతీయడం జరిగిపోయాయి. దీనిపై ఇప్పుడు దేశంలో మిగతా విపక్షాలతో పాటు జగన్ కూడా గొంతెత్తుతున్నారు.

జగన్ యూటర్న్
ఈసీల నియామకాల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసం కేంద్రం పార్లమెంట్ లో చేసిన చట్ట సవరణకు బేషరతుగా మద్దతిచ్చిన జగన్ పార్టీ వైఎస్సార్సీపీ.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అప్పట్లో తప్పు చేశామని చెబుతోంది. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాల్సిందే అని జగన్ పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఈసీతో పాటు కేంద్రంపైనా ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ సాయం తీసుకున్న కేంద్రం.. కీలకమైన డీలిమిటేషన్-మహిళా బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సమయంలో ఆయన మద్దతు కోల్పోయే పరిస్దీతి తెచ్చుకుంది. అలాగని జగన్ ను బుజ్జగించేందుకు కేంద్రంలో బీజేపీ కానీ, ఎన్డీయే కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో జగన్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది.
జగన్ నిర్ణయం వెనుక ?
రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, లేకపోయినా కేసులు, అరెస్టుల నుంచి సేఫ్ గా ఉండే లక్ష్యంతో జగన్ ఇప్పటివరకూ కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తూ వచ్చారు. కానీ చివరికి గత ఎన్నికల్లో ఎన్నికల అక్రమాల కారణంగా చిత్తుగా ఓడిపోవడంతో పాటు 11 సీట్లకే పరిమితమై విపక్ష నేత హోదా కూడా కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఆ కోపంతోనే ఇందుకు కారణమైన ఈసీతో పాటు కేంద్రాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే అంతకు ముందే చంద్రబాబు ఒత్తిడితో కేంద్రం తన దర్యాప్తు సంస్థ అయిన ఈడీని జగన్ పై ఉసిగొల్పడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో సైలెంట్ గా ఉన్న వివేకా హత్య కేసుతో పాటు మద్యం కేసుల్లోనూ ఈడీ దూకుడు కొనసాగిస్తోంది. అంతే కాదు తన అక్రమాస్తుల కేసుల్నీ దుమ్ముదులిపి కోర్టుల్లో రోజువారీ విచారణలు జరిగేలా పావులు కదుపుతోంది. దీంతో ఇక తాను ఏం చేసినా కేంద్రం టార్గెట్ చేయడం ఖాయమనే అంచనాకు వచ్చే జగన్ ఎదురుదాడి మొదలుపెట్టినట్లు అర్దమవుతోంది.

మళ్లీ 2018 వ్యూహం అమలు?
2018లో విపక్షంలో ఉన్న జగన్ .. ఏపీకి కేంద్రం విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండిపోతున్న అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబుపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతూ పోయి తన కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించారు. అయినా జగన్ పోరాటం కొనసాగించడంతో చేసేది లేక ఎన్డీయేకు సైతం గుడ్ బై చెప్పారు. అప్పటికీ జగన్ పోరు ఆపకపోవడంతో మోడీపై పోరాటం ప్రారంభించి తన చిత్తశుద్ధి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎన్నికల్లో నష్టపోవడంతో పాటు ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండిపోయారు. ఇప్పుడు జగన్ మళ్లీ అదే వ్యూహాన్ని ప్రయోగించడం ఖాయమని తెలుస్తోంది. కేంద్రం ఈసీని గుప్పిట్లో ఉంచుకుని తనకు కావాల్సిన చంద్రబాబును గెలిపించుకుందనే ప్రచారం ముమ్మరం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే జాతీయ స్ధాయిలో బలపడుతున్న ఇండియా కూటమి సాయంతో ఈ వ్యూహం బలంగా అమలు చేసేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇండియా కూటమిపై మాట్లాడకపోయినా, భవిష్యత్తులో ఏపీలోనూ ఈసీ వ్యతిరేక పోరాటాలు చేసేలా రాహుల్ అంగీకరిస్తే ఆయనతో జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో కోపంతో మోడీ జగన్ ను మళ్లీ జైలుకు పంపే అవకాశాలూ ఉన్నాయి.














Click it and Unblock the Notifications
