"ఆ పనిచేస్తే తప్ప.. దేశంలో క్యూలు తగ్గవు.."
దేశంలో కరెన్సీ కష్టాలు, క్యూ లు తగ్గాలంటే సాధ్యమైనంత ఎక్కువగా రూ. 500 నోట్లను మార్కెట్లోకి తీసుకురావడమే మార్గమని ఎస్.బి.ఐ ఎండీ చెప్పారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి ఇప్పటికే నెలరోజులు గడిచిపోయింది. సామాన్యుల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు, ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు సామాన్యులను వెక్కిరిస్తున్నాయి. దీనికి తోడు బడాబాబుల వద్ద దొరుకుతోన్న కోట్ల కొద్ది నోట్లు సామాన్యుడిలో అసహనాన్ని రగిలిస్తున్నాయి.
నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు వస్తున్న డబ్బు రోజురోజుకూ తగ్గుతోంది. రెండు మూడు వారాల క్రితం ఒక్కో వ్యక్తికి రూ. 10 వేల వరకూ ఇచ్చిన బ్యాంకులు నేడు రూ. 2 వేలు, రూ. 4 వేలతో సరిపెడుతుండటంతో.. చాలీచాలని డబ్బులతో జీవితాలను నెట్టుకురావడం కష్టంగా మారింది.

రోజుకు రూ. 24 వేలు విత్ డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ప్రకటన.. ప్రకటనకే పరిమితమైంది తప్పితే.. ఏ బ్యాంకులోను అంత డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు, ప్రజల అవస్థలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ స్పందించారు.
దేశంలో కరెన్సీ కష్టాలు, క్యూ లు తగ్గాలంటే సాధ్యమైనంత ఎక్కువగా రూ. 500 నోట్లను మార్కెట్లోకి తీసుకురావడమే మార్గమని చెప్పారు. రూ.2వేల నోటుకు చిల్లర దొరికే పరిస్థితి లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చిన్న నోట్లు వస్తే మాత్రమే చిల్లర సమస్య రూపుమాసిపోతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో ఎస్బీఐ 49 వేల ఏటీఎంలను నిర్వహిస్తుండగా, 43 వేల ఏటీఎంలను కొత్త నోట్ల జారీకి అనుగుణంగా మార్చామని తెలిపారు. రోజుకు రూ. 17 వేల కోట్ల నుంచి 19 వేల కోట్ల వరకు ఎస్.బి.ఐ ఏటీఎంల ద్వారా ప్రజలకు అందజేస్తున్నామని తెలియజేశారు.












Click it and Unblock the Notifications