Vijay: దురంధర్ గా విజయ్..! క్రేజ్ సొమ్ముచేసుకుంటున్న ఉత్తరాది-అంతా ఫేక్..!
ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక్లలో ఎవరూ ఊహించని విధంగా తలపండిన రాజకీయ పార్టీల్ని మట్టికరిపించి సీఎంగా ఆవిర్భవించిన జోసఫ్ విజయ్ (Joseph Vijay) క్రేజ్ ఇప్పుడు దక్షిణాది నుంచి ఉత్తరాదికీ పాకింది. ముఖ్యంగా విజయ్ తమిళనాడులో తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు కాస్త మసాలా జోడించి, ఆయన తీసుకోని నిర్ణయాల్ని తీసుకుంటున్నట్లుగా చూపిస్తూ సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్ధ ఇండియా టుడే (India Today) తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది.
సీఎం విజయ్ చుట్టూ సోషల్ మీడియాలో ఒక సరికొత్త నకిలీ ప్రచారం జోరందుకుంది. ఉత్తరాదికి చెందిన పలువురు హిందీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒకే రకమైన స్క్రిప్ట్‌తో, విజయ్‌ను ఒక దృఢమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది వ్యూస్ కోసం కొందరు వ్యక్తులు సృష్టించిన వ్యవస్థీకృత నకిలీ సమాచార నెట్‌వర్క్ అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో ఈ వీడియోల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఇండియా టుడే ప్రతినిధి జ్యోతి ద్వివేదీ (Jyoti Dwivedi)
చేపట్టిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

ఉత్తరాదిలో జరుగుతున్న ఈ ప్రచారంలో ప్రధానంగా రెండు అంశాలు వైరల్ అవుతున్నాయి. అత్యాచార బాధితురాలి వయసు ఎనిమిడేళ్లయినా, పద్దెనిమిడేళ్లయినా.. నిందితులకు ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ తప్పదని సీఎం విజయ్ ప్రకటించినట్లు ఒక వీడియో, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రోగి మరణిస్తే, వారి వైద్య బిల్లును పూర్తిగా రద్దు చేస్తామని విజయ్ ఆదేశించినట్లు మరో నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది. హర్యానాకు చెందిన రీతూ శర్మ, బీహార్‌కు చెందిన చందన్ క్రియేటర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోహైల్ ఖాన్ వంటి పలువురు చిన్నపాటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ వీడియోలను సృష్టించారు. వీటిని జనం కూడా నమ్ముతున్నారు. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం శిక్షల ఖరారు పూర్తిగా న్యాయవ్యవస్థ పరిధిలోని అంశం. ఓ సీఎం స్వయంగా ఎన్‌కౌంటర్లకు లేదా ఉరిశిక్షలకు ఆదేశాలు జారీ చేయలేరు. ఇవే అంశాల్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు కూడా గుర్తుచేస్తూ, ఇవన్నీ ఫేక్ వీడియోలని, సీఎం విజయ్ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తేల్చేశాయి.












Click it and Unblock the Notifications