సోనమ్ వాంగ్‌చుక్ రెండు రోజుల్లో చనిపోవచ్చు- హైకోర్టు జోక్యం కోరుతూ
విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశ రాజధానిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. కాక్రోచ్ జనతా పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించింది.
కఠోర నిరాహార దీక్షను చేపడుతున్న నేపథ్యంలో వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ వస్తోంది. లేచి నిల్చోలేని స్థితికి చేరుకుంటోన్నారాయన. ఈ 18 రోజుల్లో బరువు కోల్పోయారు. ఈ పరిస్థితుల మధ్య ఢిల్లీ హైకోర్టులో ఓ అత్యవసర ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఆయనకు వెంటనే తగిన వైద్య సదుపాయాలు కల్పించేలా ఆదేశించాలని పిటీషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. బలవంతంగానైనా సరే ఫ్లూయిడ్స్ ఇవ్వాలని కోరారు.

సీనియర్ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త రాకేశ్ కుమార్ సైనీ ఈ పిటిషనను దాఖలు చేశారు. నిరవధిక దీక్ష కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని, తక్షణ వైద్య సహాయం అందకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఆయన ఈ పిటిషన్ లో స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన రెండు రోజుల్లో మరణించవచ్చనీ రాకేశ్ కుమార్ సైనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు.
जंतर-मंतर पर सोनम वांगचुक के अनशन का आज 18वां दिन है,
— Cockroach Janta Party (@CJP_for_India) July 15, 2026
18 दिन से देश सुन रहा है,
लेकिन सत्ता खामोश है।🥺😳 pic.twitter.com/HgC1iPtItk
కిందటి నెల 28వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచీ ఆహారం తీసుకోవట్లేదు. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 8.5 కిలోల బరువు కోల్పోయారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిరాహార దీక్షను కొనసాగిస్తే రాబోయే రెండు రోజుల్లో ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిటిషనర్ అభ్యర్థించారు.
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఆయనను చికిత్స నిమిత్తం ఏదైనా ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజ లవణాలు కలిగిన ద్రవ ఆహారాన్ని బలవంతంగానైనా అందించాలని అన్నారు. భారత్ వంటి ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ఇలాంటి ప్రజాందోళనలను నిర్లక్ష్యం చేయడం, ఓ అత్యున్నత విద్య, సామాజిక వేత్త వాంగ్‌చుక్ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒక ఉన్నత సామాజిక లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడటం అత్యవసరమని, దీనిపై కోర్టు త్వరలోనే స్పందించి తగిన మార్గదర్శకాలను జారీ చేస్తుందని పిటిషనర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు విస్మరణకు గురి కావడం మంచిది కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications