పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే.. ఇప్పుడు ఇంకొకటొచ్చింది
భారత్ లో డిజిటల్ చెల్లింపులు రికార్డుస్థాయికి చేరుకుంటోన్న వేళ.. మరో పేమెంట్ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. టెక్ దిగ్గజం యాపిల్.. ఈ దిశగా కీలక అడుగు వేసింది. యాపిల్ పే (Apple Pay) ను లాంచ్ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సర్వీస్ ఇది. మొన్నటికి మొన్న ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ ను విడుదల చేసింది యాపిల్. ఇక యాపిల్ పే ను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్ కు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు మాత్రమే యాపిల్ పే సేవలు అందుబాటులో ఉంటాయి. యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌లోని వాలెట్ యాప్‌కు దీన్ని అనుసంధానించుకోవచ్చు. దీని ద్వారా వారు వివిధ స్టోర్లలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ సహాయంతో సురక్షితంగా, త్వరితగతిన పేమెంట్లు చేసుకోవడానికి వీలవుతుంది. భవిష్యత్ లో ఇతర బ్యాంకులను కూడా ఈ పరిధిలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు యాపిల్ యాజమాన్యం తెలిపింది.

యాపిల్ పే సహాయంతో బిల్లులు చెల్లించడానికి కార్డు పిన్ లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, డివైజ్ పాస్‌కోడ్ ద్వారా సులభంగా లావాదేవీలను నిర్వహించవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీల్లో అత్యంత కీలకమైన అంశం.. సెక్యూరిటీ. ఈ యాపిల్ పే లో దీనికి పెద్ద పీట వేసినట్లు యాజమాన్యం తెలిపింది. పేమెంట్ చెల్లింపుల విధానంలో కస్టమర్ కార్డు నంబర్లను ఫోన్ లోగానీ లేదా కంపెనీ సర్వర్లలో గానీ నిల్వ ఉంచరు. కార్డు నంబర్లను కూడా షేర్ చేయరు. దీనికి బదులుగా డివైజ్ అకౌంట్ నంబర్ టెక్నాలజీని ఉపయోగించి, దాని సైఫర్ కోడ్‌ను సెక్యూర్ ఎలిమెంట్‌లో భద్రపరుస్తారు.
యాపిల్ పే చెల్లింపుల ఫీచర్ అందుబాటులోకి రావాలంటే డివైజ్ మోడల్స్, వాటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అవసరమవుతాయి. ఐఫోన్ ఎక్స్ఆర్ లేదా అంతకంటే లేటెస్ట్ మోడళ్ల వినియోగదారులు ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండాలి. యాపిల్ వాచ్ సిరీస్ 6 లేదా ఆపై మోడళ్లలో వాచ్ఓఎస్ 11 తప్పనిసరి. మ్యాక్ (Mac) కంప్యూటర్ వాడే వారికి త్వరలోనే ఈ సేవలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, రూపే యూజర్లకు ఇంకా యాపిల్ పే ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రాలేదు. దీనికోసం స్వైపింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్ వంటి పేమెంట్ టెర్మినల్స్ ను యాపిల్ పే సపోర్ట్ చేసే విధంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ అప్‌డేట్స్ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని సంస్థ తెలిపింది. యూపీఐ సిస్టమ్‌కు కూడా యాపిల్ పే ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేయదు.














Click it and Unblock the Notifications
