ఆధార్ ఉంటే చాలు - రూ 35కే కిలో ఉల్లి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరల పెరుగుదల వేళ సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీ ధరలకే ఉల్లిని అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు రైతు బజార్ల ద్వారా విక్రయాలు ప్రారంభిస్తోంది. ముందుగా విజయవాడలో ప్రారంభించి క్రమేణా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ విక్రయ కేంద్రాల ద్వారా రూ 35 కే కిలో ఉల్లి పాయలు ఇవ్వనున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను ఖరారు చేసింది.
ఉల్లి ధరలు పెరిగిన వేళ కిలో రూ.35 చొప్పున రైతుబజార్లలో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి, నెలకు రెండు కిలోల చొప్పున సరఫరా చేయనున్నారు. తొలి విడతగా విజయవాడలోని అన్ని రైతుబజార్లలో రాయితీ ధరకు ఉల్లిపాయల్ని విక్రయించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నా యుడు, పౌరసఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉల్లి ధరల పెరుగు దలతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టిందని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్‌ను సమీక్షిస్తోందని వివరించారు. ఉల్లిధరల విషయంలోనూ ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో రాయితీ ధరకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని... ప్రజల డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో రాయితీ ఉల్లిని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ఆధార్ కార్డుతో రూ 35 కే విక్రయాలు
కాగా.. సబ్సిడీ ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేసింది. ఉల్లి కోసం వచ్చే వారు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకురావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ కార్డుల ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు గరిష్టంగా రెండు కిలోల ఉల్లిపాయలను మాత్రమే రూ. 35 చొప్పున విక్రయించాలని ఆదేశాలు జారీ చేసారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూర్చేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్న బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని, ప్రత్యేక కౌంటర్లలో రూ.52-50 లకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.












Click it and Unblock the Notifications
