ఫ్యూచర్ సిటీ నుండి 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేతో విజయవాడకు తగ్గనున్న 100కి.మీ దూరం
తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కీలక సమావేశం నిర్వహించి 12 లేన్ల విస్తృత గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం అనుమతి కోరారు.
ఆ రోడ్ ప్రాజెక్ట్ తో విజయవాడకు తగ్గనున్న దూరం
ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంపైన చర్చించారు. ఈ రహదారి ప్రాజెక్టుకు అనుమతినివ్వాలని కోరారు. ఈ హైవే నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ప్రయాణ దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం ఉన్న మార్గాల కంటే ఈ కొత్త రూట్ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

లాజిస్టిక్ రంగంలో కూడా తెలంగాణ పురోగతి
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే లాజిస్టిక్ రంగంలో కూడా తెలంగాణ పురోగతిని సాధిస్తుంది అని తెలిపారు. సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయని, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడతాయి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి గ్రీన్ఫీల్డ్ హైవే
అంతేకాదు బందరు పోర్టుకు సరుకు రవాణా పెరుగుతుందని, ఎగుమతి, దిగుమతి వ్యాపారం ఊపందుకుంటుందని, తెలంగాణలోని పరిశ్రమలు మరింత లాభదాయకంగా మారతాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న హామీలను సీఎం గుర్తు చేస్తూ మంత్రి నితిన్ గడ్కరీ తో చర్చించారు.
ఈ ప్రాజెక్ట్ లపైనా సీఎం చర్చ
ఇది మాత్రమే కాక మన్ననూరు శ్రీశైలం కారిడార్ కు అటవీ శాఖ అనుమతులు, హైదరాబాద్ మంచిర్యాల మధ్య ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పైన చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి క్యాబినెట్ ఆమోదం, దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరారు. అన్నిటికంటే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల హైవే నిర్మాణంపైన ప్రధానంగా చర్చించారు.













Click it and Unblock the Notifications