హైదరాబాద్-తిరుపతి విమానాలు ఫుల్.. శ్రీవాణి టికెట్ల ఎఫెక్ట్..!!
తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులతో హైదరాబాద్ నుంచి తిరుపతికి నడిచే విమాన సర్వీసులకు ఇటీవల అనూహ్య డిమాండ్ ఏర్పడుతోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ శ్రీవాణి కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో, ఈ టికెట్ల కోసం ఉదయం సమయంలో తిరుపతి విమానాశ్రయం చేరుకునేలా ప్రయాణీకులు విమాన సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు శ్రీవాణి టికెట్లకు సైతం ఈ ప్రయాణాలతో డిమాండ్ పెరిగింది.
టీటీడీ శ్రీవాణీ టికెట్లను ఉదయం 7 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు ఈ టికెట్లు జారీచేస్తుంది. ఈ టికెట్లు పొందేందుకు ఉదయం వేళ తిరుపతికి చేరుకునేందుకు భక్తులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే విమానాలు ఫుల్ అవుతున్నాయి. కాగా, హైదరాబాదు నుంచి తిరుపతికి రోజుకు దాదాపు 8 విమాన సర్వీసులు ఉన్నాయి. అయినా ఉదయం 7:20గంటలకు వచ్చే ఇండిగో ఎయిర్‌బస్, 8:30గంటలకు వచ్చే ఎయిరిండియా సర్వీసులకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో మొదట పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు కేటాయిస్తూ వచ్చిన టీటీడీ.. ప్రయాణికుల తాకిడి ఎక్కువ కావడంతో రోజుకు 200 టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. శ్రీవాణి టికెట్ల కోసం వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

శ్రీవాణి టికెట్లకు భారీగా పెరిగిన డిమాండ్
తాజాగా పెరిగిన ధరలతో ఇండిగో విమాన టికెట్ ధర సుమారు రూ.15905, ఎయిర్‌ఇండియా టికెట్ ధర రూ.11905 కు చేరుకుంది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్లు ప్రధానంగా ఈ రెండు విమానాల్లో వచ్చే ప్రయాణికులకే లభిస్తున్నాయనే కారణంగా ఈ విమానాల్లో వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. రీవాణి టికెట్ల వల్లే ఈ సర్వీసుల ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల విమాన ఇంధన ధరలు పెరగడంతో ప్రయాణికుల రద్దీని బట్టి విమాన సంస్థలు సర్వీసులను కుదించుకున్నాయి. అదేసమయంలో మధ్యాహ్నం తర్వాత వచ్చే ప్రయాణికులకు శ్రీవాణి టికెట్లు లభించడం లేదు. ఫలితంగా విమాన సర్వీసులు తగ్గడంతో నడిచేవాటిలో ధరలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం తరువాత నడిచే సర్వీసులకు డిమాండ్ లేకపోవటంతో.. ఈ మధ్య తరచూ పలు విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications