నీట్ గా లీక్ చేశారు! 90 ప్రశ్నలు ముందే అవుట్? రంగంలోకి సీబీఐ..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన 'నీట్-యూజీ 2026' (NEET-UG) పేపర్ లీకేజీ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్‌ను కీలక సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పట్టుకున్న ఈ నిందితుడిని, కేసు తీవ్రత దృష్ట్యా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తన కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.
పరీక్షకు ముందే ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఏంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కథనం ప్రకారం.. ఈ లీకైన పేపర్‌ను ఒక "గెస్ పేపర్"గా మార్చి, ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలకు ఈ నెట్‌వర్క్ పాకినట్లు అధికారులు గుర్తించారు.

90 బయాలజీ ప్రశ్నలు.. అన్నీ లీక్!
అసలు ప్రశ్నపత్రంలోని 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలు ఈ లీకైన పేపర్‌లో ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. నాసిక్‌లోని ఒక కోచింగ్ సెంటర్ ద్వారా ఈ లీకేజీ ప్రారంభమై ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలు లభించాయి. కేవలం నాసిక్ మాత్రమే కాదు, లాతూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన మాక్ టెస్ట్‌లోని 42 ప్రశ్నలు నేరుగా అసలు పేపర్‌తో సరిపోలడం ఈ కుట్ర లోతును స్పష్టం చేస్తోంది.
రంగంలోకి సీబీఐ.. ఇక అసలు వేట మొదలు!
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసి, దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు శుభమ్ ఖైర్నార్ వద్ద ఉన్న సమాచారంతో ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు కింగ్‌పిన్‌లను పట్టుకోవాలని సీబీఐ భావిస్తోంది. మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ మీదుగా హర్యానా వరకు విస్తరించిన ఈ 'ట్రాన్సిట్ పాయింట్ల' గుట్టు రట్టయితే, మరింత మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications