పాక్‌తో తాడో పేడో తేల్చుకునే తరుణంలో- అరేబియా సముద్రంపై
INS Surat: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
అటు పాకిస్తాన్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పానిక్ క్రియేట్ అయింది. భారత్ తీసుకున్న నిర్ణయాలను ఎలా తిప్పి కొట్టాలనే విషయంపై అక్కడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

అదే సమయంలో మిస్సైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. నేడు, రేపు ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులను పరీక్షించబోతోంది. కరాచీ తీర ప్రాంతంలో మిస్సైల్ టెస్టులను చేపట్టింది. రెండు రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. తీరాన్ని పంచుకుంటోన్నందున భారత్‌కూ ఈ సమాచారాన్ని అందించింది.
దీనికి ప్రతిగా అన్నట్టు- భారత్ సైతం క్షిపణి పరీక్షలను చేపట్టింది. విజయవంతంగా పూర్తి చేసింది. అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ వాహక నౌక మీది నుంచి ఈ క్షిపణిని పరీక్షించింది. అది కూడా మిస్సైల్ విధ్వంసక క్షిపణి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక.. ఐఎన్ఎస్ సూరత్. సముద్ర-స్కిమ్మింగ్ అంటే సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాన్ని ఇది ఛేదించగలుగుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసినట్టయింది. మరో మైలురాయిని అందుకున్నట్టయింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకల రూపకల్పన, వాటి నిర్మాణం, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత నౌకాదళానికి తిరుగులేదని ఈ ప్రయోగం మరోసారి రుజువుచేసింది. రక్షణ తయారీలో స్వావలంబనను సాధించినట్టయింది. సరిహద్దులను కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధత, ఆత్మనిర్భర్ భారత్‌కు, అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలిచిందని నౌకాదళం తెలిపింది.












Click it and Unblock the Notifications