మరో ముప్పు రావొచ్చు: 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటూ ప్రధాని మోడీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను హెచ్చరించారు. అంతేగకా, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరించారు. వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు.
కరోనా వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న వైద్య సిబ్బందిని ప్రధాని అభినందించారు. వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్ లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించిందని మోడీ చెప్పారు. జిల్లా అధికారుల నుంచి.. ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం కష్టపడ్డారన్నారు. మైళ్ల దూరం నడిచారు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వాక్సిన్ను విస్మరించినట్లయితే, కొత్త సంక్షోభం ఏర్పడవచ్చని ప్రధాని మోడీ హెచ్చ రించారు.

ఈ అతిపెద్ద మహమ్మారి కాలంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ ప్రాంతాల్లో టీకాను పెంచడానికి మీరు కూడా వినూత్న పద్ధతులపై కృషి చేయాలని 40 జిల్లాలకు పైగా జిల్లా మేజిస్ట్రేట్‌లకు సూచించారు. ప్రధానంగా జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలోని చాలా జిల్లాలు వ్యాక్సినేషన్లో వెనకపడ్డాయని తెలిపారు.
వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చివరి వరకు మనం పోరాడాల్సిందే. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది(కొవిడ్19) వందేళ్లలో అతిపెద్ద మహమ్మారి. దీని వల్ల దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనాపై పోరాడేందుకు కొత్త పరిష్కారాలు కనుక్కోవడం చాలా గొప్ప విషయం. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
భారతదేశంలోని అర్హతగల జనాభాలో 78 శాతం మందికి పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు. అయితే దాదాపు 38 శాతం మంది మాత్రమే రెండు డోసులు వేసుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల వరకు గత 24 గంటల్లో 41,16,230 వ్యాక్సిన్ డోస్‌లు వేసినట్లు నివేదక వెల్లడించింది. భారతదేశంలో ఇప్పటి వరకు 107.29 కోట్ల టీకా డోసులు దాటింది. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా, 10,68,514 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులకు 3.43 కోట్లకు చేరింది. మంగళవారం 311 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,159 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు 252 రోజుల కనిష్టానికి తగ్గాయి. పాజిటివిటీ రేటు 0.44 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మంగళవారం 41,16,230 మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 107 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications