ఆ పాపం మనకొద్దు: రాష్ట్రాల స్కానింగ్: 20 తరువాత అలాంటి రాష్ట్రల్లో మాత్రమే సడలింపు: మోడీ
న్యూఢిల్లీ: భారత్‌ను కరోనా వైరస్ విముక్త దేశంగా మార్చడానికి లాక్‌డౌన్ పరిస్థితులను వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ను మరింత నిబద్ధతతో పాటించాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని అన్నారు. 21 రోజుల లాక్‌డౌన్ చివరిరోజుకు సమీపించిన నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ పాపం మనకొద్దు
లాక్‌డౌన్ సడలించాల్సి వస్తే.. కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా వైరస్ సోకని ప్రాంతాలు, దాని జాడలేని ప్రదేశాలకు వ్యాపించగలిగితే.. అది మానవ తప్పిదమే అవుతుందని అన్నారు. వైరస్ లేని ప్రాంతాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా దీని బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని అన్నారు. స్థానికంగా ఏ ఒక్క పేషెంట్ అయినా కొత్తగా పెరిగితే.. అది మనలను మరింత ఆందోళనల్లోకి నెడుతుందని మోడీ చెప్పారు. వైరస్ వల్ల ఏ ఒక్కరు కొత్తగా మరణించినా విషాదాన్ని మిగిలిస్తుందని అన్నారు.
Recommended Video

హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని, అలాంటి వాటిపై మరింత నిఘా ఉంచుతామని మోడీ చెప్పారు. ఇప్పుడున్న హాట్‌స్పాట్ల సంఖ్యను క్రమంగా నిర్మూలించుకుందామని అన్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సి వస్తే..కొత్త హాట్‌స్పాట్లు పుట్టుకొస్తాయని, అవన్నీ మరిన్ని సవాళ్లను విసురుతాయని మోడీ హెచ్చరించారు. వచ్చే వారం రోజుల పాటు లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని అన్నారు.

అలాంటి రాష్ట్రాల్లో 20వ తేదీ తరువాత సడలింపు..
ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని అన్ని ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ల పరిధులు, రాష్ట్రాల్లో ఇప్పుడున్న దాని కంటే మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను పాటించాలని మోడీ సూచించారు. ఈ వారం రోజుల పాటు అన్ని రాష్ట్రాలపైనా డేగకన్ను వేస్తామని, ప్రతి రాష్ట్రం నుంచి రోజువారీ లెక్కలను సేకరిస్తామని అన్నారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నియంత్రించే రాష్ట్రాలకు ఈ నెల 20వ తేదీ తరువాత లాక్‌డౌన్‌ను సడలించుకునే అవకాశాన్ని ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు.

వైరస్ నియంత్రణలో ప్రగతి సాధించేలా..
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రాష్ట్రం కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని మోడీ సూచించారు. కరోనా నియంత్రణలో ప్రగతి సాధించాలని అన్నారు. కొత్త హాట్‌స్పాట్లు పుట్టుకుని రాకుండా, పాజిటివ్ కేసుల సంఖ్యను కట్టడి చేసేలా, ఇప్పుడున్న హాట్‌స్పాట్లలో నెలకొన్న తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకునే రాష్ట్రాల ప్రభుత్వాలకు మాత్రమే ఈ నెల 20వ తేదీ తరువాత లాక్‌డౌన్‌ను సడలించుకునే అవకాశం ఇస్తామని మోడీ కుండబద్దలు కొట్టారు.

నిబంధనలపై కసరత్తు..
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను సడలించడానికి అవసరమైన నిబంధనలను రూపొందించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలను రూపొందించిందని, దీన్ని బుధవారం ప్రకటిస్తామని అన్నారు. లాక్‌డౌన్ నుంచి బయటికి రావడానికి ఉద్దేశించిన ఈ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయని, వాటిని అందుకుంటేనే సడలింపు ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉంటే.. వెంటనే ఆ సడలింపును వెనక్కి తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

సడలింపు వారి కోసమే
రోజువారీ కూలీలు, దినసరి వేతన కార్మికులే తన కుటుంబ సభ్యులు అని, వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆ కారణం వల్లే తాము కరోనా కట్టడిలో ప్రగతిని సాధించే రాష్ట్రాలకు సడలింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెప్పారు. సడలింపు తరువాత కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాన్ని ఉపసంహరిస్తామని మోడీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications