19 ఏళ్లకే గ్యాంగ్ స్టర్, భారత్ మీద పగతో అమెరికా ఎస్కేప్, రెడ్ కార్నర్ నోటీసు జారీ!
న్యూఢిల్లీ/గురుగ్రామ్: ఖలిస్తాన్ అంశంపై భారత్, కెనడాల మధ్య వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు చెబుతున్న హరియానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ అలియాస్ యోగేష్ (19)పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, అక్రమ ఆయుధాలతో సహా పలు నేరాలకు సంబంధించి యోగేష్ మీద కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటికే యోగేష్ మీద కేసులు నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు యోగేష్ నకిలీ పాస్‌పోర్టుతో భారత్ నుంచి పారిపోయి అమెరికాలో తలదాచుకున్నాడని సమాచారం అందింది. ఎన్ఐఏ ( NIA) అధికారులు యోగేష్ కు సంబంధించిన ఇల్లు, అతని రహస్య స్థావరాలపై దాడి చేసింది. యోగేష్ కు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో లింక్ పెట్టుకున్న యోగేష్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ 1. 50 లక్షలు బహుమతిని ప్రకటించారు. నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేష్ చిన్న వయస్సులో ఉన్నప్పటికీ అతను అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడని అధికారులు అంటున్నారు.
హరియానాకు చెందిన యోగేష్ పంజాబ్‌లోని కరుడుగట్టిన బంబిహా గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను అనేక గ్యాంగ్ సంబంధిత సంఘటనలలో పాల్గొన్నాడని, పేరుమోసిన ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాతో సంబంధం కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. భారతదేశం మరియు కెనడా మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన విభేదాల మధ్య ఈ పరిణామం జరిగింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల భారత్ మీద తీవ్రవ్యాఖ్యలు చేశారు. భారత ఏజెంట్లు పక్కాప్లాన్ తో ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపారని కెనడా ప్రధాని ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య వివాదం మొదలైంది. సబర్బన్ వాంకోవర్‌లో నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇలాంటి సమయంలో 19 ఏళ్లకే గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న యోగేష్ నకిలి పాస్ పోర్టుతో భారతదేశం వదలి విదేశాలకు పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications