ఐటీ హబ్ లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్, కోర్టులో ఎన్ఐఏ చార్జ్ షీట్, పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్ !
కర్ణాటక రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రూపొందించిన పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన 8 మంది అనుమానిత ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. 8 నిందితుల్లో ఇప్పటికే ఆరు మందిని అరెస్టు చేశారు.
మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. పరారిలో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నారని, ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు వివరించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేరళకు చెందిన నాసీర్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడని, ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ అహ్మద్, సల్మాన్ ఖాన్ విదేశాల్లో తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి జూన్ 19వ తేదీన పోలీసులు దాడి చేసి ఐదుగురు లష్కర్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుల నుంచి 7 నాడా పిస్టల్స్, 45 లైవ్ బుల్లెట్లు, వాకీవాటి, డ్రాగర్లు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన కేసు కావడంతో 2023 అక్టోబర్‌లో ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ ఈ ఉగ్రవాదులను మరో కేసులో అరెస్టు చేశారు.

యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడానికి వీరు ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉగ్రవాద సంస్థలకు అక్రమంగా డబ్బు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు శక్రవారం తొలి ఛార్జిషీట్‌ను సమర్పించింది. తదుపరి విచారణ కొనసాగిస్తోందని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.












Click it and Unblock the Notifications