Nitin Gadkari: మోడీ కేబినెట్ మార్పుల వేళ గడ్కరీ కలకలం..! ఆ కామెంట్స్ వెనుక ?
కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రధాని మోడీ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్షాళన కాస్తా త్వరలో జరగనుందనే వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేబినెట్లో సీనియర్ మంత్రుల్లో ఒకరైన నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నాగ్‌పూర్ జిల్లాలోని కాటోల్‌లో జరిగిన 'ఏకలవ్య ఏకల్ విద్యాలయ' ఉపాధ్యాయ-పర్యవేక్షకుల శిక్షణా తరగతిలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తావిచ్చాయి.
తాను ఎవరికీ స్ఫూర్తిదాయకం కాదని, గతంలోలాగా ఇప్పుడు పని చేయలేకపోతున్నానని గడ్కరీ తెలిపారు. బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాలని తాను ఇప్పుడు అందరికీ చెబుతుంటానన్నారు. కొత్తవారు ముందుకు వస్తారని, పాత తరం వారికి మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. అప్పుడే ఈ పని ముందుకు సాగుతుంది, విస్తరిస్తుందన్నారు. మహారాష్ట్రలో విద్యుత్ సౌకర్యం లేని గిరిజన గ్రామం ఒక్కటి కూడా మిగలకూడదనే స్థాయికి ఈ పని చేరాలని తాను కోరుకుంటున్నానని గడ్కరీ తెలిపారు.

ఈ వ్యాఖ్యలతో కేబినెట్ నుంచి స్వచ్చందంగా తప్పుకునేందుకు గడ్కరీ సిద్దమవుతున్నారన్న సంకేతం ఇచ్చారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై ఇవాళ ఆయన ఆఫీసు క్లారిటీ ఇచ్చింది. నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు లక్ష్మణరావు మంకర్ ట్రస్ట్ కార్యకలాపాల సందర్భంలో చేసినవేనని, వాటికి రాజకీయాలతో గానీ లేదా ఆయన రాజకీయ భవిష్యత్తుతో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. గడ్కరీ గత కొంతకాలంగా ఆ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, ట్రస్ట్ పనితీరు, భవిష్యత్తు నాయకత్వానికి సంబంధించిన సందర్భంలోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. ఆ వ్యాఖ్యలను అసలు సందర్భం నుండి వేరు చేసి, కొందరు టెలివిజన్ ఛానళ్లు వాటిని రాజకీయ ప్రకటనగా చిత్రీకరిస్తున్నాయని ఆ కార్యాలయం పేర్కొంది.














Click it and Unblock the Notifications