వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nitin Gadkari: ఒకప్పుడు ఆయన కోసం పార్టీ నిబంధనలే మార్చారు... ఇప్పుడు ఆయన్ను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నితిన్ గడ్కరీ

నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టడం కోసం అప్పట్లో పార్టీ రాజ్యాంగాన్నే సవరించారు. కానీ, ఇప్పుడు గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు తప్పించారు.

బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు సభ్యుల జాబితాను విడుదల చేయగానే పార్టీ నాయకుడు సుబ్రమణియం స్వామి ట్వీట్ చేశారు.

"జనతా పార్టీ రూపొందిన తొలినాళ్లలో ఆఫీసు బేరర్ పదవుల నియమాకాల గురించి కూడా చర్చించేవారు. పార్టీలో పదవుల కోసం ఎన్నికలు నిర్వహించేవారు. పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికలు జరగాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. ప్రతి నామినేషన్ పదవికీ మోదీ ఆమోదం అవసరమవుతుంది" అని ట్వీట్ చేశారు.

https://twitter.com/Swamy39/status/1560079814433746944?

నేషనల్ కాంగ్రెస్ పార్టీ క్లేడ్ క్రాస్టో కూడా బీజేపీ పై విమర్శలు చేశారు.

"నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం చూస్తుంటే ఒక రాజకీయ నాయకునిగా ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారని అర్థమవుతోంది. మీ సామర్థ్యం, తెలివితేటలు పెరిగినప్పుడు అధికారులకు సవాలుగా నిలుస్తారు. అలాంటి వారి హోదాను బీజేపీ తగ్గిస్తుంది. రాజకీయ కళంకితులకు పదవులిస్తుంది" అని ట్వీట్ చేశారు.

https://twitter.com/Clyde_Crasto/status/1559832030426308610

గడ్కరీకి గల స్పష్టమైన ఆలోచనా తీరు, బలమైన ఇమేజ్ గత కొన్నేళ్లుగా ఆయన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం పడింది.

రాజకీయాల కోసం 20 శాతం మాత్రమే పని చేస్తానని, మిగిలిన 80 శాతం సామాజిక కారణాల కోసం పని చేస్తానని నితిన్ గడ్కరీ చాలాసార్లు చెప్పారు.

నాగపూర్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో "మహాత్మా గాంధీ ఉన్న సమయంలో రాజకీయాలు దేశం కోసం, సమాజం కోసం, అభివృద్ధి కోసం ఉండేవి. కానీ, ప్రస్తుతం రాజకీయాలంటే అధికారం కోసమే ఉన్నాయి" అని అన్నారు.

కొన్నిసార్లు రాజకీయాలను వదిలి బయటకు రావాలని ఆయన మనసు చెబుతూ ఉంటుందని గడ్కరీ అన్నారు.

గడ్కరీ ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే పార్టీ ఆయనకు పార్లమెంటరీ కమిటీ నుంచి బయటకు వెళ్లేందుకు దారి చూపించింది.

పార్టీ నిర్ణయానికి కారణం ఏంటి? గడ్కరీ నిజంగానే పార్టీ నాయకత్వానికి సవాలుగా నిలుస్తున్నారా?

బీజేపీ నాయకులతో కలిసి గడ్కరీ

పార్టీలో తగ్గుతూ వచ్చిన హోదా

గడ్కరీ రాజకీయ జీవితాన్ని బీబీసీ మాజీ ప్రతినిధి ప్రవీణ్ ముదోల్కర్ గత 20 ఏళ్లుగా పరిశీలించారు.

"గత 9 ఏళ్లలో పార్టీలో గడ్కరీ హోదా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇదంతా వ్యూహాత్మకంగా చేశారు. 2022లో నితిన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించడం కొత్త విషయమేమి కాదు" అన్నారాయన.

"2014లో మోదీ క్యాబినెట్ ఏర్పడినప్పుడు నితిన్ గడ్కరీకి దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తి అధికారాలిస్తారని మాటలు వినిపించాయి. కానీ, చివరకు ఆయనకు ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ లభించింది.

కేబినెట్ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే అప్పటి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, జల్ శక్తి మంత్రి గోపీనాథ్ ముండే అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణం తర్వాత ఆయన పోర్ట్ ఫోలియోలు కూడా గడ్కరీకి వచ్చాయి. కానీ, కొన్ని రోజుల తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు.

2017లో అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి పర్యవేక్షణలో ఉండే జలవనరులు, గంగా నది, నదుల అభివృద్ధి శాఖను కూడా గడ్కరీకి అప్పగించారు.

కానీ, 2019 తర్వాత గడ్కరీకి రోడ్డు రవాణా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను ఇచ్చారు. కానీ, ఒక సంవత్సరంన్నర కాలంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను వెనక్కి తీసుకున్నారు.

ప్రస్తుతం గడ్కరీ దగ్గర ఒక విభాగం మాత్రమే ఉంది.

"మొదట్లో భారీ బాధ్యతలను అప్పగించి తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. కానీ, ఆయన ఏ విభాగంలో పని చేసినా కూడా ప్రశంసించదగ్గ పని చేశారు" అని ప్రవీణ్ చెప్పారు.

ఆయన పని బాగున్నప్పటికీ, పార్టీలో ఆయనను పక్కకు పెట్టడానికి మోదీతో ఆయనకున్న సంబంధాలే కారణమని అంటారు ప్రవీణ్.

గడ్కరీ, మోదీ

మోదీతో సంబంధాలు

2009లో నితిన్ గడ్కరీని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఆయనను అభినందించేందుకు దిల్లీ రాలేదు.

2009 - 2013 వరకు గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు.

పార్టీలో నరేంద్ర మోదీకి గట్టి ప్రత్యర్థిగా భావించే సంజయ్ జోషీకి కొన్ని అధికారాలను ఇవ్వడంలో గడ్కరీ కీలక పాత్ర పోషించారు. కన్నీళ్లు పెట్టుకునే మోదీని సంజయ్ జోషీ ఇష్టపడేవారు కాదు.

2012లో సంజయ్ జోషీని ఉత్తర్ ప్రదేశ్ కన్వీనర్‌గా నియమించడం మోదీకి నచ్చలేదు. ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రచారానికి కూడా వెళ్లలేదు.

2012లో పార్టీ ముంబయిలో జరిగిన పార్టీ సమావేశంలో సంజయ్ జోషీ రాజీనామా చేయాలని మోదీ డిమాండ్ చేశారు. గడ్కరీకి ఇష్టం లేకపోయినా కూడా జోషీతో రాజీనామా చేయించాల్సి వచ్చింది.

గడ్కరీ, అమిత్ షా, ఫడణవీస్‌

అమిత్ షాతో సంబంధాలెలా ఉన్నాయి?

అమిత్ షాతో ఆయన సంబంధం గురించి సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ బీబీసీకి రాసిన ఒక పాత వ్యాసంలో రాశారు.

"నితిన్ గడ్కరీ బీజీపీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో కోర్టు ఆదేశాల కారణంగా అమిత్ షా గుజరాత్ వదిలిపెట్టాల్సి వచ్చింది. గడ్కరీని కలిసేందుకు ఆయన గంటలకొద్దీ వేచి ఉండాల్సివచ్చేది.

కానీ, ఆ తరువాత పార్టీలో మోదీ, షా ఆధిక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో, గడ్కరీ అధికారాలను నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టారు.

"ఇది మహారాష్ట్రలోనే మొదలైంది. గడ్కరీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కానీ, మోదీ షా ద్వయం ఆయనను పక్కకు పెట్టి దేవేంద్ర ఫడణవీస్‌‌ను ముఖ్యమంత్రి చేశారు. గడ్కరీ కంటే తక్కువ రాజకీయ అనుభవం ఉన్న ఫడణవీస్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

"ఫడణవీస్‌, గడ్కరీల మధ్య సంబంధాలు తటస్థంగా ఉన్నాయి" అని మహారాష్ట్ర టైమ్స్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పాద్ అపరాజిత్ చెప్పారు.

గడ్కరీతో పోలిస్తే ఫడణవీస్‌ అనుభవం చాలా తక్కువ అని అన్నారు.

అయితే.. "గడ్కరీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకోవడం నిజమే. కానీ, కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆయన అనుకోలేదు" అని అపరాజిత్ అన్నారు.

ఇవనీ జరిగినా కూడా గడ్కరీ పని తీరులో మార్పులేమీ కనిపించలేదు. ఆయన గతంలో మాదిరిగానే సమర్థంగా పనిచేశారు.

నితిన్ గడ్కరీ

గడ్కరీ రాజకీయ ఆలోచనలు

గడ్కరీ మోదీ చెప్పే ప్రతీ విషయాన్ని అంగీకరించేవారు కాదని.. ఆయన మోదీని ప్రశంసించే వారు కాదని బీజేపీ రాజకీయాలను దగ్గరగా పరిశీలించినవారు చెబుతారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది.

ఆయన పని ఆధారంగానే ఆయన తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని సృష్టించుకున్నారు. ఆయన సంఘ్ పరివారానికి కూడా సన్నిహితుడు కావడం మరొక కారణం.

గడ్కరీ మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగా మతపరమైన ప్రకటనలు చేసేవారు కాదని సీనియర్ జర్నలిస్ట్ సునీల్ చావ్కే అన్నారు.

"ఆయనెప్పుడూ పని, అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతారు. మిగిలిన బీజేపీ నాయకుల మాదిరిగా ఆయన ప్రతిపక్ష నాయకులను అంటరానివారిగా చూడరు" అని అన్నారు.

"బీజేపీ కాంగ్రెస్ మధ్య వైరం అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, గడ్కరీకి ప్రతిపక్షాలతో సత్సంబంధాలున్నాయి. ఆయన కాంగ్రెస్ నాయకులతో కూడా కలిసి కూర్చుంటారు. 2019లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా గడ్కరీ చేస్తున్న పనులను ప్రశంసించారు. రాహుల్ గాంధీ కూడా ఆయనను ప్రశంసించారు".

https://twitter.com/RahulGandhi/status/1092345837001281536

"కానీ, పార్టీ గడ్కరీ వైఖరిని సమర్థించదు" అని చావ్కే అన్నారు.

"పార్టీ హద్దులను దాటి గడ్కరీ చాలాసార్లు ప్రకటనలు చేశారు.

"పార్టీ కోణంలోంచి చూస్తే గడ్కరీ ప్రకటనలు సరైనవిలా అనిపించవు. ఇటీవల ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆయనకు అలాంటి కోరిక ఉన్నప్పటికీ వాటిని బహిరంగంగా వ్యక్తం చేయకూడదు. ఇవన్నీ అంతర్గతంగా జరగాలి.

ఇలాంటి ప్రకటనలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేందుకు అవకాశాన్నిస్తాయి. అలాగే, ప్రతిపక్షాలతో కలిసి గడపడం కూడా సరైంది కాదు" అని చావ్కే అన్నారు.

పార్టీలో ఉండగానే, గడ్కరీ చాలా సార్లు కాంగ్రెస్ పటిష్టం కావాలని అన్నారు. బీజేపీ అంటే మోదీ షా పార్టీ కాదని ఆయన చాలా సార్లు అన్నారు.

మన్‌మోహన్ సింగ్‌తో గడ్కరీ

గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు ఆయన ఓ సందర్భంలో.

మార్చి 27, 2022: ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో ప్రతిపక్షాన్ని నాశనం చేయాలని అంటూ రాజకీయ పార్టీల మనుగడను సవాలు చేస్తున్న సమయంలో గడ్కరీ కాంగ్రెస్ పటిష్టం కావాలని అన్నారు.

"ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలని నేను కోరుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న వారు పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరించి పార్టీలోనే ఉండాలి. ఓటమి పాలయ్యానని నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కృషి చేయాలి" అని ఆయన పుణెలో ఒక జర్నలిజం అవార్డు తీసుకుంటున్న సందర్భంలో అన్నారు.

https://twitter.com/ANI/status/1089502342460915714

జనవరి 2019: ముంబయిలో జరిగిన ఒక సమావేశంలో " రాజకీయ నాయకులు చూపించే కలలను ప్రజలు ఇష్టపడతారు. కానీ, వారు చూపే కలలను నిజం చేయకపోతే, ప్రజలు వారి పై తిరగబడే ప్రమాదం కూడా ఉంది. సాకారం చేయగలిగే కలలను మాత్రమే చూపించండి. నేనా కలలు కనేవారిలో ఒకరిని కాదు. నేను చెప్పే ప్రతి మాటను నూరు శాతం నిలబెట్టుకోవాలనే చూస్తాను" అని అన్నారు.

గడ్కరీ చేసిన ఈ ప్రకటన నుంచి చాలా మంది చాలా రకాల అర్ధాలు తీసుకున్నారు.

ప్రతిపక్షం ఆయనను తమ ప్రభుత్వ ప్రతిబింబంలా మాట్లాడుతున్నారని అన్నాయి. ఈ విషయం గురించి వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గడ్కరీ చేసిన ప్రకటన ప్రధాని మోదీ గురించి కాదని, అది ప్రతిపక్షాలనుద్దేశించి చేసిందని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

నితిన్ గడ్కరీ

ఇందిరా గాంధీ పై ప్రశంసలు

జనవరి 2019: బీజేపీ ఇందిరా గాంధీని, దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని తీవ్రంగా విమర్శిస్తున్న తరుణంలో నాగ్‌పూర్‌లో జరిగిన ఒక సమావేశంలో నితిన్ గడ్కరీ ఇందిరా గాంధీని ప్రశంసించారు.

ఆమె కాంగ్రెస్ లో ఉన్న ఇతర పురుష నాయకులతో సమానంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుని తన సమర్ధతను నిరూపించుకోవడం పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు.

బీజీపీ మోదీ షా పార్టీ కాదు

మే 2019: బీజేపీలో మోదీ స్థాయి పెరుగుతూ, పార్టీ ఆయన చుట్టూ కేంద్రీకృతమై ఉందా అని అడిగినప్పుడు, బీజేపీ ఆదర్శాలతో కూడిన పార్టీ అని అన్నారు. బీజీపీ అటల్ అడ్వాణీ లేదా మోదీ షా పార్టీ కాదు అని సమాధానమిచ్చారు.

ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్ల ప్రయోజనం ఏంటి?

ఆగస్టు 2018: మరాఠా రిజర్వేషన్లు అంశం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వానికున్న సమస్యలను గడ్కరీ మరింత పెంచారు.

దేశంలో ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన అన్నారు.

గడ్కరీ చేసిన ఈ ప్రకటనను ప్రతిపక్షాలు కూడా బాగా ప్రచారం చేశాయి.

గడ్కరీ

గడ్కరీ ప్రయాణం

నితిన్ గడ్కరీ నాగ్ పూర్‌లో పుట్టి పెరిగారు. ఆయనొక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

ఎల్‌ఎల్‌బి, ఎం.కామ్ చదివి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే అడుగుపెట్టారు.

1995లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన సంకీర్ణం ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పని చేశారు. 1989లో మొదటిసారి శాసన మండలికి ఎన్నికయ్యారు.

అప్పటి నుంచి ఆయన 20 ఏళ్ల పాటు 2008 వరకు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు.

2013 వరకు పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేశారు. కానీ, అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనే ఆ పదవిని చేపట్టేందుకు నిరాకరించారు. పార్టీ లోపల కూడా ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది గొంతు విప్పారు.

గడ్కరీ సంస్థ పూర్తి పవర్ అండ్ షుగర్ లిమిటెడ్ అవినీతికి పాల్పడిందని ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిన తర్వాత కేజ్రీవాల్ గడ్కరీకి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

పార్లమెంట్ సభ్యుడు అజయ్ సంచేక్తితో వ్యాపార సంబంధాలు పెట్టుకుని బొగ్గు గనుల కేటాయింపులో రూ. 450 కోట్ల ప్రయోజనం పొందారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ 2012లో ఆరోపించారు.

దిగ్విజయ్ చేసిన ఆరోపణలతో గడ్కరీ పరువు నష్టం కేసు నమోదు చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఆయన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని రాజకీయ వేడిలో ఇలాంటి ప్రకటన చేశానని అన్నారు.

నితిన్ గడ్కరీ, ఫడణవీస్‌

గడ్కరీ అవలంబించే మార్గం ఏంటి?

రెండు దశాబ్దాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఒక నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకునిగా ప్రతిష్టను ఏర్పరుచుకున్న గడ్కరీ అవలంబించబోయే మార్గం ఏంటి? 2024 తర్వాత ఆయన కేంద్ర క్యాబినెట్‌లో ఉంటారో లేదో అనేది ప్రశ్నార్థకమే అని చావ్కే అన్నారు.

గడ్కరీ సంఘ్‌కి కూడా దగ్గరగా మెలగకపోవడంతో ఆయనను సంఘ్ నుంచి కూడా దూరంగా పెట్టి చాలా రోజులవుతోంది.

"మరో వైపు, గడ్కరీ ఇంటికి పరిమితం కావడం కానీ, లేదా ఆయన సమర్ధతను నిరూపించుకుంటూ అత్యున్నత స్థానానికి వెళ్లడం కానీ జరగొచ్చు" అని చావ్కే అంటున్నారు.

అదే సమయంలో గడ్కరీ లాంటి నాయకులను రాజకీయ సన్యాసం చేయమని చెప్పడం సంఘ్ వైఫల్యమే అవుతుందని కొంత మంది నాయకులు అంటారు. నాగ్‌పూర్‌కి చెందిన ఇద్దరు నాయకుల తరుపున సంఘ్ నిలబడాలి. గడ్కరీ చేస్తున్న పనిని దేశమంతా ప్రశంసిస్తుంటే సంఘ్ అటువంటి నాయకుని వెంట ఉండటానికి అభ్యంతరమేమి ఉంటుంది?

"సంఘ్ లోగిలిలో పెరిగిన వ్యక్తి వెనుక నిలబడని పక్షంలో ఆ వ్యక్తికి అంత కంటే గొప్ప వైఫల్యం ఇంకేమి ఉండదు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nitin Gadkari: Party rules were changed for him once... Now he has been removed from the Parliamentary Board
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X