సీఎంగా రికార్డు నెలకొల్పిన నితీష్ కుమార్..!!
బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాట్నా గాంధీ మైదాన్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కేబినెట్ సహచరులు హాజరయ్యారు. బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేశారు. వీరితో పాటు బీజేపీ తరపున 12, జేడీయూ- 7, ఎల్జేపీ- 2, హెచ్ఎఎం, ఆర్ఎంఎల్ తరపున ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేశారు.

సుమారు 50 నిమిషాల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. మంత్రుల జాబితా భారీగా ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోలేదు. ఒక్కో విడతలో అయిదుమందితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. తొలుత నితీష్ కుమార్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత- సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే, డాక్టర్ దిలీప్ జైస్వాల్ (ఎమ్మెల్సీ), నితిన్ నబిన్ పేర్లను చదివి వినిపించారు గవర్నర్.
వారి తర్వాత- రామ్‌కృపాల్ యాదవ్, సంజయ్ సింగ్ 'టైగర్', అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, నారాయణ్ ప్రసాద్, రామ నిషాద్, లఖేంద్ర పాశ్వాన్, శ్రేయసి సింగ్, డాక్టర్ ప్రమోద్ కుమార్ చంద్రవంశీ, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, శ్రావణ్ కుమార్, విజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, లేసీ సింగ్, జామా ఖాన్, మదన్ సాహ్ని ప్రమాణం చేశారు.
ఎల్జేపీ నుంచి సంజయ్ కుమార్, సంజయ్ సింగ్, హిందుస్తాన్ ఆవామీ మోర్చా నుంచి సంతోష్ కుమార్ సుమన్, ఆర్ఎంఎల్ నుంచి దీపక్ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. కొత్త మంత్రులను అభినందించారు. నితీష్ కుమార్, చంద్రబాబుతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఫొటోలు దిగారు.












Click it and Unblock the Notifications