కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై తేల్చేసిన మెహబూబా ముఫ్తీ..!
త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ముఖ్యంగా పదేళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మారిన పరిస్ధితుల ప్రభావం వీటిపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. గతంలో బీజేపీతొ పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీడీపీ ఈసారి ఏం చేయబోతోందనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకునే అంశంపై వస్తున్న వార్తలకు పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీతో తన పార్టీ పీడీపీ ఎలాంటి పొత్తూ పెట్టుకోబోదని అధినేత్రి మెహబూబా ముఫ్తీ తేల్చిచెప్పేశారు. అలాగే ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో ఎలాంటి అవగాహన ఉండదన్నారు. అటు జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వంలో మాత్రం తన పార్టీ పీడీపీ పాత్ర కచ్చితంగా ఉంటుందని ముఫ్తీ వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ తో జట్టు కట్టేందుకు ససేమిరా అన్న ముఫ్తీ.. ఇప్పుడు బీజేపీతోనూ వెళ్లకుండా ఒంటరిపోరుకే మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు స్థానిక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పై ముఫ్తీ విమర్శలు ఎక్కుపెట్టారు. 1947 నుంచీ ఆ పార్టీ అధికారమే లక్ష్యంగా, మంత్రి పదవుల సాధనే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుందని ముఫ్తీ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ మాత్రం అజెండా ఆధారంగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అందుకే వచ్చే ప్రభుత్వంలో తమ పాత్ర కచ్చితంగా ఉంటుందని వెల్లడించారు. 2002లో కేవలం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వ ఏర్పాటు చేశామని, ఈసారి కూడా దైవానుగ్రహం ఉంటే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామన్నారు.












Click it and Unblock the Notifications