No-Confidence Motion: లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసానికి ముహుర్తం ఫిక్స్..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి (no-confidence motion) రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇతర విపక్ష పార్టీలు 100కు పైగా సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. దీనిపై అంతర్గతంగా చర్చించుకున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు... మార్చి 9న ఈ తీర్మానంపై లోక్ సభలో చర్చ పెట్టి, అదే రోజు ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ మార్చి 8న ప్రారంభం కాబోతోంది. దీంతో సమావేశాల తొలిరోజే లోక్ సభలో స్పీకర్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను, ఓటింగ్ ను నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ వెల్లడించారు. ఏప్రిల్ 2 వరకూ పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అడ్డంకి లేకుండా తొలిరోజే స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన చర్చ, ఓటింగ్ పూర్తి చేయనున్నారు.

ఇప్పటికే పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు తీవ్రంగా అడ్డుపడిన నేపథ్యంలో రెండో దశలోనూ అదే పరిస్ధితి కొనసాగవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే రెండో దశ సమావేశాల్లో విపక్షాలు నిరసనలతో సభల్ని అడ్డుకోవాలని చూస్తే వారికే నష్టమని కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. విపక్షాల్లో ఐక్యత లోపించిందని, చాలా చిన్న పార్టీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయలేదని రిజిజు గుర్తుచేశారు. అలాగే తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తృణమూల్ వంటి పార్టీలు కూడా దీనికి మద్దతివ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications