Sheikh Hasina: హసీనా అప్పగింతకు భారత్ కీలక షరతులు..! సైనిక విమానం, ఆర్మీ ఆహ్వానం?
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో పదవీచ్యుతురాలై, పారిపోయి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఈ డిసెంబర్ లో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ ప్రక్రియ అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తనకు కొత్త పాస్ పోర్టు మంజూరు చేయాలని హసీనా ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. బంగ్లాదేశ్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆమెను తమకు అప్పగించి తీరాలని భారత్ ను కోరుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్ పోర్టు విజ్ఞప్తిని బంగ్లా ప్రభుత్వం తోసిపుచ్చడంతో భారత్ వైపు నుంచి హసీనా తన ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో బంగ్లాదేశ్ కు షేక్ హసీనాను అప్పగించేందుకు భారత్ కొన్ని షరతులు పెట్టినట్లు బంగ్లా వార్తాపత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. హసీనా భద్రతకు కొన్ని హామీలతో పాటు నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించిన తర్వాతే ఆమెను పంపిస్తామని భారత్ చెప్పినట్లు తెలుస్తోంది. బీబీసీ బంగ్లా నివేదిక ప్రకారం, హసీనా ప్రవాసం నుండి తిరిగి రావడానికి ఆచరణీయమైన మార్గాన్ని సృష్టించడానికి భారత్ కొంతకాలంగా కృషి చేస్తోంది. వీటి ద్వారా ఆమె భద్రత, న్యాయం జరిగేలా ప్రయత్నిస్తోంది. ఈ నివేదికల ప్రకారం షేక్ హసీనాను న్యూఢిల్లీ నుంచి తిరిగి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ఒక సైనిక విమానాన్ని పంపాలని భారత్ కోరుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునేందుకు, 2024 అణచివేతపై కొత్తగా విచారణ ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తామని భారత్ హామీ కోరినట్లు సమాచారం. అలాగే బంగ్లా సరిహద్దుల్లో సైన్యం అధికార లాంఛనాలతో హసీనాను తీసుకెళ్లాలని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నివేదికల్ని భారత్, బంగ్లాదేశ్ రెండూ నిర్దారించలేదు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని సహాయ పత్రికా కార్యదర్శి కేఎం నజ్ముల్ హక్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. హసీనాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశమూ సుముఖత చూపలేదని తెలిపారు. యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫిన్లాండ్, యునైటెడ్ స్టేట్స్, బెలారస్, ఖతార్, ఆఫ్రికాలో ఒక్క దేశం కూడా ఒక జాతిహత్యకు పాల్పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే, హసీనాకు ఒకదాని తర్వాత ఒకటిగా మార్గాలు మూసుకుపోతున్నాయన్నారు. క్షేత్రస్థాయి అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారుల రక్తంపై ఆధారపడి చివరి ప్రయత్నంగా ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
