60 ఏళ్లుపైబడినవారికి మెడికల్ సర్టిఫికేట్లు అవసరం లేకుండానే ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఆంక్షలు కూడా అమలు చేయాలని సూచించింది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
కాగా, కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ముందు జాగ్రత్త(ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అందించాల్సిన/అప్ లోడ్ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

మంగళవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యుడి దగ్గర్నుంచి తమ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి పత్రాలు తీసుకురాకపోయినా 60 ఏళ్లు పైబడినవారు ముందు జాగ్రత్త డోసు(ప్రికాషనరీ డోసు) తీసుకోవచ్చని ఈ సమావేశంలో నిర్ణయించింది. అయితే, టీకా తీసుకునే ముందు వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.
ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని కేంద్రం ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈసీ బృందం పర్యటిస్తోంది.
కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు అందించనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకా అందించనున్నట్లు తెలిపారు. కాగా, రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 39 వారాలు దాటిన తర్వాతే ఈ ముందు జాగ్రత్త డోసు స్వీకరించడానికి అర్హత లభిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications