పక్షపాతం చూపించొద్దు, వేధింపులపై కొత్త చట్టం: ప్రణబ్
హైదరాబాద్: సివిల్ సర్వెంట్స్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మహిళల పట్ల, చిన్నారుల పట్ల జరుగుతున్న అత్యాచారాల పైన కఠిన చట్టాలను తీసుకు వచ్చామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం అన్నారు. ఐపిఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రణబ్ పాల్గొన్నారు. ఐపిఎస్‌లో గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ఐపిఎస్‌లు వృత్తిపట్ల నిబద్దత, అంకితభావం కలిగి ఉండాలని సూచించారు. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సివిల్ సర్వెంట్స్ ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. దేశంలో జరుగుతున్న సంఘ విద్రోహ చర్యలను అణిచి వేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మహిళలు, చిన్నారులు, అల్పసంఖ్యాక వర్గాల రక్షణకు పోలీసులు ఎల్లవేళలా కృషి చేయాలన్నారు. దేశ సమగ్రతకు తోడ్పడాలన్నారు. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల విచారణకు కొత్త చట్టం తెచ్చామన్నారు. ఉగ్రవాదం, చొరబాటులను అరికట్టడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందన్నారు. భారత్ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతోందన్నారు.
కాగా, హైదరాబాదులోని జాతీయ పోలీసు అకాడమీలో 148 మంది ఐపిఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన వారు 8మంది ఉన్నారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ రాజ్ భవన్ నుండి జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లారు. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications