Tamil Nadu: రాజకీయాల్లో రీటేక్స్ ఉండవు..! విజయ్ కు చిదంబరం కౌంటర్..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ ఛీఫ్ విజయ్ (Vijay)నిత్యం ఆయా పార్టీలపై పంచ్ లు విసురుతుండగా.. వారు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే విజయ్ పాలిటిక్స్ ఆయన్ను ఎన్నికల తీరం దాటించేలా లేవన్న సర్వే ఫలితాల నేపథ్యంలో అధికార డీఎంకే కూటమి ఆయనపై దాడిని మరింత ముమ్మరం చేసింది.
ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (chidambaram) ఇవాళ టీవీకే అధినేత విజయ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సినిమాల్లో రీటేక్స్ ఉంటాయి తప్ప రాజకీయాల్లో ఉండబోవని విజయ్ ను ఉద్దేశించి చిదంబరం వ్యాఖ్యానించారు. రాజకీయాలు సినిమాల్లో నటించినంత సులువు కాదని ఆయన స్పష్టం చేశారు. హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టారని, ఆయనకు ఈ రంగంలో అనుభవం లేదని చిదంబరం గుర్తుచేశారు.

తాను రాజకీయాల్లో 20 ఏళ్లుగా కొనసాగుతున్నానని, కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో పలు పదవులు చేపట్టానని చిదంబరం గుర్తుచేసుకున్నారు. కానీ రాజకీయాలు సినిమాల్లా ఉండవని తెలిపారు. సినిమా సెట్ లో యాక్టర్లు తాము చేసిన సీన్ సరిగా రాకపోతే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, కానీ రాజకీయాల్లో అలా ఉండదన్నారు. ఇక్కడ రీటేక్స్ అనేవి ఉండవన్నారు. ఒకే నిర్ణయం తీసుకుని, దాన్ని కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కోసమే పనిచేయాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు ర్యాలీల్లో విజయ్ మాట్లాడకపోవడాన్ని తప్పబడుతూ.. ప్రజల్లో మమేకం కావాల్సిందేనని హితవు పలికారు.












Click it and Unblock the Notifications