విమానాశ్రయంలో విషాదం: వీల్‌చైర్ లేక నడుచుకుంటూ వెళ్లి వృద్ధుడు మృతి
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ (wheelchair) అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు గత సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్నారు. టికెట్ కొనుగోలు సమయంలోనే వీరిద్దరూ వీల్‌చైర్ ప్రయాణికులుగా బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే ఇచ్చారు. దీంతో తన బార్యను ఒక వీల్ చైర్‌లో కూర్చోబెట్టిన అతడు.. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు.

అయితే, విమానం దిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచి అతడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. కాగా, ఈ ఘటనపై ఎయిరిండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇది దురదృష్టకర ఘటన. ఆ రోజు వీల్‌చైర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చక్రాల కుర్చీని ఏర్పాటు చేసే వరకు ఎదురుచూడాలని మేం ఆ ప్రయాణికుడికి చెప్పాం. కానీ, ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. మృతుడి కుటుంబంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సాయం అందిస్తామని ఎయిరిండియా తన ప్రకటనలో పేర్కొంది. కాగా, న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్న ఆ విమానంలో 32 మంది వీల్‌చైర్ కోసం బుక్ చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. గ్రౌండ్ సిబ్బంది వద్ద కేవలం 15 మాత్రమే అందుబాటులో ఉండటంతో కొందరిని వేచిచూడాలని కోరినట్లు తెలిపాయి.












Click it and Unblock the Notifications