'కాలేజీల్లోకి అడుగుపెడుతున్నారా?.. హెచ్చరిక గుర్తుంచుకోండి..'
ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఇకనుంచి ఇతరులెవరూ క్యాంపస్ లోకి వెళ్లడానికి వీల్లేదని విద్యాశాఖ కమిషనర్ నాగభూషణం ఆదేశాలు జారీ చేశారు.
బెంగుళూరు: మహిళలపై వరుసగా చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని మహిళా రక్షణ కోసం పలు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి విద్యాశాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
కళాశాల ప్రాంగణంలోకి ఇతరుల ప్రవేశాన్ని పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ కమిషనర్ అజయ్ నాగభూషణం ప్రకటించారు. దీంతో అనుమతి లేకుండా ఇతరులు కళాశాలలోకి అడుగుపెట్టడం పూర్తిగా నిషిద్ధం కానుంది.
బెంగళూరులో మహిళలపై చోటు చేసుకుంటున్న వరుస అఘాయిత్యాల నేపథ్యంలో.. కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ తీర్మానం చేసినట్టుగా అజయ్ నాగభూషణం తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో చదివే యువతులకు పూర్తి భద్రత కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఇకనుంచి ఇతరులెవరూ క్యాంపస్ లోకి వెళ్లడానికి వీల్లేదన్నారు.

ప్రతీ కళాశాల ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నాగభూషణం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కళాశాలకు ప్రహారీలతో పాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నట్టుగా తెలియజేశారు. ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం పలు మార్గదర్శకాలు సూచించినట్టుగా చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 411 ప్రభుత్వ కళాశాలలు, 3లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 2లక్షల మంది బాలికలు ఉన్నట్టుగా తెలిపారు.












Click it and Unblock the Notifications