బీజేపీలో చేరను, కానీ..: కాంగ్రెస్ పార్టీని వీడటంపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ తేల్చేశారు
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతుండటంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు అమరీందర్ సింగ్. కానీ, బీజేపీలో చేరకపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం లేనట్లేనని స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు అమరీందర్ సింగ్. ఈ క్రమంలో తాజాగా, ఓ మీడియా ఛానల్‌తో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన ఆయన.. ఇక ఆ పార్టీలో ఉండలేనని చెప్పారు. తనను అనేక అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బుధవారం కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు అమరీందర్ సింగ్. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.

అమిత్ షాతో సుమారు 45 నిమిషాలపాటు అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత భేటీకి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రైతుల సమస్యలపై కేంద్రమంత్రితో చర్చించినట్లు అమరీందర్ తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను కొనసాగించాలని, లేదంటే పంజాబ్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ తర్వాత కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందించారు. అమిత్ షా నివాసం దళిత వ్యతిరేక రాజకీయాలకు వేదికవుతోందని ఆరోపించారు. కాగా, అమరీందర్ సింగ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లగా.. అదే రోజు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు తన పదవికి రాజీనామా చేశారు. తాను కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని చెప్పారు.
కాగా, అమిత్ షాతో అమరీందర్ భేటీకి ముందు రోజే నవజ్యోతి సింగ్ సిద్ధు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన రాజీనామాను అంగీకరించడం లేదు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధూ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో సిద్ధు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
ఇక గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు అమరీందర్ సింగ్. సిద్ధూపై ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒకవేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే.. పంజాబ్ రాష్ట్రానికేగాక, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదముందని చెప్పారు అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్ధును పంజాబ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. కాగా, ఓ వైపు అమరీందర్ సింగ్‌ను మరోవైపు నవజ్యోత్ సింగ్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications