చీ..చీ.. ఒవైసీ కంటే నోటానే బెటర్ అనుకున్నారుగా..?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో నోటా బటన్ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నోటా చాలా మంది అభ్యర్థులను కష్టాల్లో పడేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఆర్జేడీకి 23.03 శాతం ఓట్ షేర్ రాగా.. బీజేపీకి 21.46 శాతం, జేడీయూకు 19.04 శాతం, కాంగ్రెస్‌కు 8.13 శాతం, నోటాకు 1.84 శాతం, ఏఐఎంఐఎం పార్టీకి 1.75 శాతం ఓట్లు వచ్చాయి.
ఓట్ల శాతం పరంగా చూస్తే, ఆర్జేడీ (23.03%) అత్యధిక ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కేవలం 4 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. అయితే ఈ పార్టీకి వచ్చిన 1.75 శాతం ఓట్ల కంటే ఎక్కువ అంటే 1.84 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. దీని అర్థం సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడలేదని తెలిపారు. నోటాకు వచ్చిన ఈ పెద్ద సంఖ్యలో ఓట్లు, ముఖ్యంగా కీలక నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతో పోరాడుతున్న అభ్యర్థుల విజయ సమీకరణాలను ప్రభావితం చేశాయి.

నోటాకు 1.84 శాతం ఓట్లు రావడం ఆర్జేడీకి పరోక్షంగా నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా మహాఘటబంధన్ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు మధ్య అతి తక్కువ ఓట్ల తేడా ఉన్న సీట్లలో నోటాకు వచ్చిన వేల ఓట్లు ఓటమికి దారితీశాయి. ఒవైసీ పార్టీకి 1.75శాతం ఓట్లు వచ్చినా, అవి ప్రధానంగా సీమాంచల్ ప్రాంతంలోని ముస్లిం ఓట్లను చీల్చాయి. ఇది సాంప్రదాయకంగా ఆర్జేడీకి వెళ్లాల్సిన ఓట్లు కావడంతో మహాఘటబంధన్ విజయావకాశాలను దెబ్బతిన్నాయి.
ఆర్జేడీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ, పెద్ద సంఖ్యలో ఓటర్ల మద్దతు ఉన్నా ఈ మద్దతును మెజారిటీ సీట్లలోకి మార్చడంలో పార్టీ విఫలమైంది. ఎన్డీఏ స్థానిక అభ్యర్థులు, క్షేత్రస్థాయి వ్యూహాలు, సరైన ఓట్ల సమీకరణ ద్వారా అతి తక్కువ మెజారిటీలతో ఎక్కువ సీట్లను గెలుచుకోవడంలో విజయం సాధించింది. ఈ అంశాలన్నీ కలిసి ఆర్జేడీ అత్యధిక ఓట్ల శాతం సాధించినప్పటికీ, అసెంబ్లీలో మెజారిటీ సీట్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.












Click it and Unblock the Notifications