రైల్వే టికెట్లపై ఆంక్షలు: నెలకు ఆరు టికెట్లు మాత్రమే
న్యూఢిల్లీ: అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ ఆన్‌లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇకపై నెలలో ఆరుసార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే విధంగా నిబంధనలను సవరించింది.
ఈ మేరకు రైల్వే శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిబంధన ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో 90 శాతం మంది మాత్రమే ఒక నెలలో ఆరు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారని, మిగతా 10 శాతం మంది పది టికెట్లు బుక్ చేస్తున్నారని తేలింది.

ఇప్పటివరకు ఈ-టికెటింగ్ ద్వారా ఒక నెలలో ప్రయాణికులు పదిసార్లు టెక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇందులో భాగంగానే బుకింగ్ సంఖ్యను తగ్గించారు. అయితే తత్కాల్, అడ్వాన్స్ రిజర్వ్ బుకింగ్ సందర్భాల్లో పాత విధానమే కొనసాగుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానంలో చోటు చేసుకంటున్న అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. తాజా నిబంధనతో తరచూ రైళ్లలో ప్రయాణం చేసేవారికి కాస్త ఇబ్బందులు మొదలైనట్టే. అయితే, రైల్వేశాఖ కొత్త నిబంధనలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణ ప్రయాణికులకు ఈ విధానం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!