అజిత్ ధోవల్ మాస్టర్ ప్లాన్! గత 12 ఏళ్లలో భారత సైన్యంలో..
భారతదేశం ఒక ఉమ్మడి ప్రయాణమని, ఇందులో ప్రతి పౌరుడూ భాగస్వామేనని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ఉద్ఘాటించారు. శనివారం ముస్లిం సమాజానికి చెందిన పండితులు, ప్రముఖులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ భద్రత, ఐక్యతపై తనదైన శైలిలో 'హై-వోల్టేజ్' సందేశాన్ని ఇచ్చారు. దేశాన్ని సవాళ్లను ఎదుర్కొనే ఒక భారీ నౌకతో పోలుస్తూ.. "మనం కలిసి ప్రయాణిస్తాం లేదా కలిసి మునిగిపోతాం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ధోవల్ 'నౌక' రూపకాన్ని అత్యంత ప్రభావవంతంగా వాడారు. అంతర్గత విభేదాలు దేశ నిర్మాణాన్ని బలహీనపరుస్తాయని, దేశం అనే నౌకను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడూ ఒక సిబ్బందిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావనను కలిగించే విచ్ఛిన్నకర శక్తుల కథనాలను నిలువరించాలని, దేశ స్థిరత్వం అనేది కేవలం ఒక ఆశయం మాత్రమే కాదు, అది భారతదేశ మనుగడకు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

రక్షణ దళాల్లో ముస్లిం యువత 'సైలెంట్ రివల్యూషన్'!
ఈ సమావేశంలో ధోవల్ ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని వెల్లడించారు. గత 12 ఏళ్లలో భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సరిహద్దు భద్రతా దళం (BSF) వంటి పారామిలిటరీ విభాగాలలో ముస్లిం యువత నియామకాలు అసాధారణంగా పెరిగాయని ఆయన తెలిపారు. "ఇది కేవలం ఉద్యోగ నియామకం కాదు.. ఇది ఒక నిశ్శబ్దమైన, అర్థవంతమైన పరివర్తన" అని ఆయన అభివర్ణించారు. దేశం పట్ల ముస్లిం యువతలో పెరుగుతున్న నిబద్ధతకు, 'దేశమే మొట్టమొదటి ప్రాధాన్యత' అనే భావన బలం పుంజుకోవడానికి ఇది నిదర్శనమని ధోవల్ ప్రశంసించారు.
డిజిటల్ తీవ్రవాదంపై గట్టి హెచ్చరిక
నేటి డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం, తీవ్రవాద కంటెంట్ యువతను దారి తప్పిస్తున్నాయని ధోవల్ హెచ్చరించారు. అటువంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజ నాయకులే "మొదటి రక్షణ శ్రేణి" (First Line of Defence) అని ఆయన పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఛాందసవాద ప్రభావాలకు తావుండకూడదని ఆయన సూచించారు. యూనిఫాంలో ఉండి దేశ సరిహద్దులను కాపాడుతున్న ముస్లిం సైనికుల త్యాగాలను స్మరిస్తూ.. దేశ భద్రతా వ్యవస్థలో వారు అంతర్భాగమని ధోవల్ కొనియాడారు.
అంతర్గత ఐక్యతే.. బాహ్య బలం!
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అజిత్ ధోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతంతరించుకున్నాయి. దేశం అంతర్గతంగా బలంగా ఉన్నప్పుడే బాహ్య శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన తేల్చి చెప్పారు. "మనం లోపల విడిపోతే, బయట నుండి వచ్చే సవాళ్లకు మరింత బలహీనంగా మారుతాం" అని హెచ్చరిస్తూ, దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని కోరారు.














Click it and Unblock the Notifications