ఒడిశా రైలు ప్రమాదంలో 233 మంది మృతి - 600 మందికి గాయాలు..!!
ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు. మూడు రైళ్లు ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రయాణీకులు చెల్లా చెదురయ్యారు. చీకట్లో పూర్తి సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోగీల నుంచి 170 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయిన వారు ఆర్తనాదాలు చేస్తున్నారు.
పెరుగుతున్న మృతుల సంఖ్య:ఒడిశా రైలు ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయినట్టు సమాచారం. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి.

కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12864) ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
వందల మందికి గాయాలు: ఇప్పటి వరకు 233 మంది మరణించారని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా ప్రకటించారు. 600 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిని బోగీల నుంచి తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ స్పష్టం చేశారు.
గాయపడినవారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 50 మంది వైద్యులను.. క్షతగాత్రుల తరలింపునకు 115 అంబులెన్సులను రప్పించారు. గాయపడ్డవారిలో 47 మందిని బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు.. 132 మందిని సమీపంలో ఉన్న సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ప్రమాద స్థలికి వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపారు.

సహాయక చర్యలు ముమ్మరం: ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. తీవ్రగాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్పగాయాలు అయినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తాను వెంటనే ప్రమాదస్థలికి బయల్దేరారు. ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు.. షాలిమార్ నుంచి బయల్దేరిన ఈ రైలు చెన్నైకు ప్రయాణించే క్రమంలో ప్రమాదానికి గురవడంతో.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్పందించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రైల్లో ఉన్న తమిళులను కాపాడేందుకు.. రాష్ట్ర రవాణా మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్‌ను, మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఒడిశాకు పంపించి సహాయకచర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిస్థితిని తాను స్వయంగా సమీక్షిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications