విమానంలో షాకింగ్: మహిళపై మూత్రం పోశాడు! సిబ్బంది నిర్లక్ష్యం, 30 రోజులు నిషేధం
న్యూఢిల్లీ: విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో వికృత చర్యకు పాల్పడ్డాడు. బిజినెస్ క్లాసులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అయినప్పటికీ.. సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విమానం ల్యాండ్ అయ్యాక దర్జాగా వెళ్లిపోయాడు. గత నవంబర్ నెలలో ఎయిరిండియా విమానంలో జరిగిన ఈ జుగుప్సకర ఘటన ఆలస్యకరంగా వెలుగులోకి వచ్చింది.

మద్యం మత్తులో మహిళపై మూత్రం పోశాడు
గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఈ చోటు చేసుకుంది. 70 ఏళ్ల పైబడిన ఓ వృద్ధురాలు బిజినెస్ క్లాసులో ఉండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె సీటు దగ్గరకు వచ్చి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడ్నుంచి అతడు కదలకపోవడంతో మరో ప్రయాణికుడు వచ్చి బలవంతంగా పంపించారు. భోజనం తర్వాత విమానంలో లైట్లు ఆర్పేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.

నిందితుడిపై చర్యలు శూన్యం
బాధిత మహిళ ఈ ఘటనపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ప్రయాణికుడి చర్య కారణంగా తన దుస్తులు, బ్యాగు తడిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో సిబ్బంది ఆమెకు మరో జత దుస్తులు, స్లిప్పర్స్ ఇచ్చారు. అయితే, నిందితుడైన ప్రయాణికుడిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. దీంతో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడు ఏం జరగనట్లుగా వెళ్లిపోయాడు.

ఎయిరిండియా ఛైర్మన్‌కు మహిళ ఫిర్యాదు..
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి ఆ మహిళ.. ఘటన జరిగిన మరుసటి రోజు ఎయిరిండియా సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. తనపై మూత్ర విసర్జన చేయడంతో తాను తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలిపారు. సిబ్బంది స్పందన కూడా సరిగా లేదని వాపోయారు. మూత్రంతో తడిసిన సీటులోనే తాను కూర్చున్నానని.. విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా.. తనను కూర్చునేకుందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఆమెలేఖ తర్వాత ఎయిరిండియా ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.

మూత్రం పోసిన ప్రయాణికుడిపై ఎయిరిండియా నిషేధం
సదరు ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాయి. అంతేగాక, అతడిని నో-ఫై జాబితాలో చేర్చాలని డీజీసీఏకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై డీజీసీఏ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను ఆదేశించినట్లు సమాచారం. కాగా, 30 రోజులపాటు సదరు ప్రయాణికుడిపై ఎయిరిండియా నిషేధం విధించింది.












Click it and Unblock the Notifications