పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు
LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.195. 50 పైసలు పెరిగాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది రెండో నెల. కిందటి నెల అంటే మార్చి 1వ తేదీన కూడా వీటి రేట్లు పెరిగాయి. అప్పట్లో ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 28 రూపాయలుపెరిగింది. నాలుగు నెలల్లోనే ఐదోసారి ధరలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా మరో 195 రూపాయల మేర అదనపు భారం వినియోగదారులపై పడింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ఈ పెంపు ప్రభావం స్పష్టంగా కనిపించింది.ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న ఈ రంగానికి, తాజా ధరల పెరుగుదల మరింత ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది. ఈ పెంపుతో హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ రేట్ల ముఖ చిత్రమే సమూలంగా మారిపోయింది. ఒక్కో సిలిండర్ పై ఇప్పుడు 2,000 రూపాయలకు పైగా మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 195.50 పైసల మేర పెరిగింది. ఇప్పుడు రూ. 2,078.50కి చేరింది. ప్రస్తుత ఏడాదిలో ఢిల్లీలో మొత్తం రూ. 498 పెరుగుదల కనిపించింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా 218 పెరిగింది. రూ. 2,208కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 524 రూపాయల పెరుగుదల కనిపించింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర 196 పెరిగి, రూ. 2031కి చేరుకుంది. తొలి మూడు నెలల కాలంలో ఇక్కడ పెరిగిన రేటు రూ. 499.50 పైసలు.
చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 203 రూపాయల మేర పెరిగింది. ఈ పెంపుతో ఇక్కడ ఇప్పటివరకు 507 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే ధరల బాంబు పేలడం ఆందోళనకరంగా భావిస్తోన్నారు. మున్ముందు మరిన్ని భారీ వడ్డింపులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications