పార్లమెంట్ స్పెషల్: తొలి రోజు లిస్ట్ ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి ఎన్నికలు లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వేదికపై ఆసీనులవుతారు.
తొలి రోజు లిస్ట్ అయిన అంశాలు, అజెండా బులెటిన్‌ను లోక్‌సభ సెక్రెటేరియట్ విడుదల చేసింది. 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం మీద సెషన్స్ మొదటి రోజున లోక్‌సభలో చర్చిస్తారు. ఈ 75 సంవత్సరాల వ్యవధిలో భారత్ సాధించిన విజయాలు, వాటి వల్ల కలిగిన దేశ ప్రజలకు జరిగిన లబ్దిపై చర్చ ఉంటుంది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావడం, కేంద్ర ప్రభుత్వం అమృత్ కాల మహోత్సవంగా దీన్ని జరుపుకొంటోండటం వల్ల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి రోజున దీన్ని అజెండగా చేర్చారు. స్వాతంత్య్రానంతరం సాధించిన ఘన విజయాలు, అనుభవాలు, వాటి తాలూకు జ్ఞాపకాలపై సభ్యలు చర్చిస్తారు.
అమృత్ కాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా సభలో చర్చకు రానున్నాయి. 2047 నాటికి సాధించదలచుకున్న లక్ష్యాల గురించి చర్చిస్తారు. వాటిని అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడతారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి సంకల్పం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications