కోటి మందికి నో ట్యాక్స్! బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను, కేటాయింపులను వెల్లడించారు. పార్లమెంట బడ్జెట్ సమావేశం అనంతరం శనివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాజాగా మినహాయింపుతో కోటి మందికిపైగా ప్రజలు పన్ను భారం నుంచి ఊరట లభించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

బడ్జెట్‌లో ఆదాయపన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి తెలిపారు. గతంలో రూ. 8 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటి వరకు రూ. 30 వేల పన్ను కట్టేవారు. ఇకపై వారంతా ఏమీ కట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మిగితా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట కల్పించామని వివరించారు.
రూ. 12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ పెంపుతో కోటి మందికిపైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సవరించిన పన్ను శ్లాబుల ద్వారా మధ్య తరగతి ప్రజల చేతుల్లోకి గణనీయమైన డబ్బు చేరుతుందన్నారు. ఇక, సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1 లక్షకు రెట్టి చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
బడ్జెట్‌లో ఖర్చు చేసే ప్రతీ రూపాయికి అత్యంత వివేకంతో వ్యవహరించామన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని తెలిపారు. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని వివరించారు. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతుగా నిలుస్తున్నామని వివరించారు.
చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపర్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు ఈ బడ్జెట్‌లో శ్రీకారం చుట్టామన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. అవసరమైన మూలధన వ్యయం కల్పించామని నిర్మలా సీతారామన్ తెలిపారు.












Click it and Unblock the Notifications