జీవీకేను బెదిరించి అదానీకి వ్యాపారాలు: రుణం తీర్చుకుంటోన్న మోదీ: రాహుల్ నిప్పులు
గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ పై ఇవ్వాళ లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అదాని, ప్రధాని మోదీలపై ఘాటు వ్యాఖ్యలతో చెలరేగారు.
హైదరాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన దుమారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. స్టాక్ మార్కెట్లల్లో అదాని ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ భారీగా పడిపోయింది. ఇప్పటికే ఆ కంపెనీ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయింది. అదాని ఎంటర్ ప్రైజెస్ ఇదివరకు ప్రకటించిన 20,000 కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ను కూడా రద్దు చేయాల్సి పరిస్థితి వచ్చింది.

జేపీసీ కోసం..
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటోన్నారు. కళ్ల ముందే ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ నిలదీస్తోన్నారు.
జోడో యాత్ర తరువాత..
ఉదయం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం లోక్ సభ సమావేశమైంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. అదాని వ్యవహారంపై నిప్పులు చెరిగారు. భారత్ జోడో యాత్ర ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ సభకు హాజరయ్యారు. జోడో యాత్ర తరువాత సభలో మాట్లాడటం ఇదే తొలిసారి.
నిప్పులు చెరిగిన రాహుల్..
తన ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వినిపించిన పేరు అదాని మాత్రమేనని, ఏడెనిమిదేళ్లల్లో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఆయన ఎలా ఎదిగారన విషయాన్ని దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటోన్నారని అన్నారు. స్టార్టప్స్ పెట్టాలనుకునే ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా ఆ చిట్కా గురించి తనను అడిగారని పేర్కొన్నారు.
609 నుంచి రెండో స్థానానికి..
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు - ధనవంతుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న గౌతమ్ అదాని.. 2022/23 నాటికి ప్రపంచంలోనే అపర కుబేరుల స్థానంలో రెండో స్థానానికి ఎలా ఎగబాకారని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. మోదీతో అదానికి ఉన్న సంబంధం ఎలాంటిదనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత దేశ ప్రజల్లో నెలకొందని రాహుల్ గాంధీ చురకలు అంటించారు.

ఇప్పటిది కాదు..
మోదీ- అదాని మధ్య గల సంబంధం ఇప్పటిది కాదని రాహుల్ గాంధీ అన్నారు. చాలా సంవత్సరాల కిందటే ఇది ఆరంభమైందని గుర్తు చేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానితో సంబంధాలు మొదలయ్యాయని, ఎవరైనా ఒక వ్యక్తి మోదీతో భుజం భుజం కలిపి నిలబడ్డాడంటే అది అదానియేనని, ప్రధానికి అత్యంత విధేయుడని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తరువాతే అసలు మ్యాజిక్ మొదలైందని, అదాని అపర కుబేరుడిగా అవతారం ఎత్తడానికి అక్కడే బీజం పడిందని ధ్వజమెత్తారు.
కాశ్మీర్ యాపిల్ నుంచి..
కాశ్మీర్ యాపిల్ నుంచి విమానాశ్రయాల వరకు మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి అదానియేనని, ఇప్పటికే ఆయన 8 నుంచి 10 రంగాల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. అనుభవం లేని కంపెనీలకు విమానాశ్రయాల నిర్వహణను అప్పగించకూడదనే నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండేదని, దాన్ని ఎవరు తొలగించారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టుల నిర్వహణ ఏ మాత్రం తెలియని అదానికి- అత్యంత రద్దీతో కూడుకుని ఉన్న విమానాశ్రయాలన్నింటినీ కేంద్రం ధారదాత్తం చేసిందని అన్నారు.

డిఫెన్స్ లోనూ ఎంట్రీ..
ఆయుధాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని గౌతమ్ అదాని కంపెనీలు చివరికి రక్షణరంగంలోనూ అడుగు పెట్టాయని రాహుల్ గాంధీ నిలదీశారు. మోదీ ప్రధాని హోదాలో ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, శ్రీలంక.. ఇలా వివిధ దేశాల పర్యటనలకు వెళ్లొచ్చిన ప్రతీసారీ ఆయా దేశాల నుంచి కాంట్రాక్టులు అదాని లభిస్తుంటాయని, ఇదెలా సాధ్యపడుతుందో దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. విమానాశ్రయాల నిర్వహణలో ఉన్న జీవీకే సంస్థలపై సీబీఐ, ఈడీ, ఐటీలతో దాడులు జరిపించి, బెదిరించి- ఆ వ్యాపారాలన్నింటినీ అదానీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications