మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ: 'ఆ సమస్యకు త్వరలోనే పరిష్కారం'
న్యూఢిల్లీ: పదవీ విరమణ పొందిన సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకానికి త్వరలోనే పరిష్కారం చూపుతామని ప్రధాని మోడీ చెప్పారు. ఆదివారం ఉదయం ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా సైనికులు, రైతులు విద్యార్ధులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
ముందుగా ఆయన దేశ వ్యాప్తంగా వడదెబ్బ వల్ల మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఎండల్లో బయటకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు.
గెలుపొటములు జీవితంలో ఒక భాగం, ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నారు. అపజయాలను విజయాలుగా మలచుకోవాలని, దేశ సేవ గురించి విద్యార్థులు ఆలోచించాలని ఆయన సూచించారు. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన సామాజిక సంక్షేమ పథకాలను గురించి మాట్లాడారు.

కిసాన్ టీవీ ఛానెల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నా ఆయన కిసాన్ ఛానెల్ ద్వారా రైతులకు విలువైన సమాచారం అందుతుందని, రైతులు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇక, మాజీ సైనిక ఉద్యోగులకు వర్తించే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం నమ్మకానికి, దేశభక్తికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
40 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండటం శోచనీయమని, త్వరలో దీనికి త్వరలో సరైన పరిష్కారం చూపుతామని అన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా సమాన పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నందనే ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications