
కాంగ్రెస్‌కు గతవైభవం రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే: మంటపెట్టిన శశిథరూర్: అంటుకోక తప్పదు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాయి. ఇప్పట్లో కోలుకోనివ్వకుండా చేశాయి. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగ్గా- ఏ ఒక్క చోట కూడా ఆశించిన సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి. అధికారం కాదు కదా.. కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరమైనన్ని సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. ఉన్నంతలో గోవాలో మాత్రమే ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది ఆ పార్టీ ప్రస్థానం. కంచుకోటగా ఉంటూ వచ్చిన పంజాబ్‌ను పోగొట్టుకుంది.
టార్గెట్
సోనియా:
కాంగ్రెస్
జీ
23
నేతల
భేటీ:
త్వరలో
వర్కింగ్
కమిటీ

పరువు కోల్పోయిన కాంగ్రెస్..
పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ రెండు చోట్లా ఓడిపోయారంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భదౌర్, చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గాల్లో ఛన్నీ పోటీ చేశారు. అయినప్పటికీ- విజయం ముఖం చాటేసింది. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఘోరంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. భదౌర్‌లో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ వుగోకే, చామ్‌కౌర్ సాహిబ్‌లో ఆప్‌కే చెందిన చరణ్‌జీత్ చేతిలో ఓడిపోయారు ఛన్నీ.

సిద్ధూ ఓటమి..
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం పరాజయం పలకరించింది. సిద్ధు పోటీ చేసిన అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థిని జీవన్ జ్యోత్ కౌర్ ఘన విజయాన్ని అందుకున్నారు. మరోవంక- కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు వారెవరూ నిలవలేకపోయారు. చేతులెత్తేశారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సైతం ఓటమి చవి చూశారు.

కాంగ్రెస్‌లో అసంతృప్తి..
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి, అసహనానికి దారి తీసింది. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించకపోవడం పట్ల ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా కూడా లేకుండా పోయింది. ఒక్క భారీ విజయం కోసం ముఖం వాచి పోయేలా ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఎంతకాలం ఇలా పరాజయాలు వెంటాడుతాయనేది కూడా అర్థం కాని పరిస్థితిలో పడింది.

నాయకత్వ మార్పు తప్పనిసరి..
ఈ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ స్పందించారు. ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, కాంగ్రెస్ సానుకూల దృక్పథం, ఐడియాలజీని మరోసారి పునరుద్ధాటించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీని దేశ ప్రజలకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

వ్యవస్థీకృత మార్పులు తప్పనిసరి..
కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థీకృత మార్పులు, నాయకత్వంలో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తు చేశాయని శశిథరూర్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో కాంగ్రెస్ ఐడియాలజీని మళ్లీ పునరుద్ధరించేలా వ్యవస్థీకృత నాయకత్వంలో మార్పులు తప్పదని తేల్చి చెప్పారు. గెలవాలంటే- మార్పు తప్పదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఈ దిశగా వీలైనంత త్వరగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

త్వరలో సీడబ్ల్యూసీ..
తాజాగా ఎదురైన అయిదు రాష్ట్రాల ఓటమిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమీక్షించుకోనుంది. దీనికోసం త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఓటమిపాలు కావడానికి గల కారణాలపై ఆరా తీయనుంది. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవడం, తీర్మానాలను ఆమోదించడం చేయొచ్చు. ప్రస్తుతానికి సీడబ్ల్యూసీ అజెండా- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అయినప్పటికీ- నాయకత్వ మార్పిడి అంశంపైనా చర్చించ వచ్చని అంటున్నారు.

జీ-23 కూడా..
అదే సమయంలో కాంగ్రెస్‌కు చెందిన జీ-23 నాయకులు కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో జీ-23 భేటీ ఏర్పాటవుతుందని తెలుస్తోంది. నాయకత్వ మార్పిడి విషయంపైనే ప్రధానంగా చర్చిస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం, సమర్థులైన బయటి నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అజెండా త్వరలోనే ఖరారవుతుంది.