ఉల్లి ధరల మంట.. రైతుకూ కన్నీళ్లే..! కిలో రూ. 60 దాటింది.. సామాన్యుడికి షాక్

వంటింట్లో ప్రతిరోజూ కనిపించే ఉల్లి ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్‌ ను కుదిపేస్తోంది. కొన్ని రోజుల క్రితం కిలో రూ.40-50 మధ్య ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు పలు నగరాల్లో రూ.60 దాటాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.100కు చేరువగా ఉన్నాయి. సెప్టెంబర్ 5న దిల్లీలో కిలో ఉల్లి రూ.58, ముంబైలో రూ.53, చెన్నైలో రూ.63, రాంచీలో రూ.40గా నమోదైంది. దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర రూ.50.79కు చేరింది. ఆగస్టు 28న కేంద్రం సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించిన సమయంలో ఇదే సగటు ధర రూ.48.50 మాత్రమే. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకున్న పది రోజుల్లోనూ జాతీయ సగటు ధర తగ్గకపోగా కొంత పెరిగింది.

ఇదే సమయంలో సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.42.79గా ఉంది. సామాన్యుడికి ధర పెరుగుతోంది.. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇదే ఉల్లి మార్కెట్‌లోని అసలు వైరుధ్యం. ఉల్లి ధర పెరిగితే వినియోగదారుడు నష్టపోతాడు. ధర పడిపోతే రైతు నష్టపోతాడు. ఒక దశలో రైతు పొలంలో పండించిన ఉల్లికి కిలోకు కొన్ని రూపాయలు కూడా దక్కని పరిస్థితి వస్తుంది. మరో దశలో అదే ఉల్లి మార్కెట్ దాటి వినియోగదారుడి చేతికి చేరే సమయానికి భారీ ధర పలుకుతుంది.

మధ్యలో జరిగే ఈ ధరల ప్రయాణంలో రైతు వాటా ఎంత? వినియోగదారుడిపై పడే భారం ఎంత? అన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఉల్లి ధరల పెరుగుదల కేవలం మార్కెట్‌లో సరఫరా తగ్గిందనే ఒక్క మాటతో ముగిసే సమస్య కాదు. ఇది పంటల సాగు, నిల్వ వ్యవస్థ, వాతావరణం, రవాణా, వ్యాపారుల నిల్వలు, మార్కెట్ వ్యవస్థ, ప్రభుత్వ నిర్ణయాలు అన్నింటితో ముడిపడిన సంక్లిష్ట సమస్య. ఉల్లి ధరల పెరుగుదల ఎందుకు ఇంత వేగంగా జరుగుతోంది..? ఉత్పత్తి తగ్గలేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..? రైతు పండించిన ఉల్లి వినియోగదారుడి చేతికి చేరేలోపు ధర ఎందుకు రెట్టింపవుతోంది..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఉల్లి పంట స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.

ఉత్పత్తి ఎక్కువే.. సరఫరాలోనే అసలు సమస్య

భారత్‌లో ఉల్లి ఉత్పత్తి పెద్ద మొత్తంలోనే ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2024-25లో దేశంలో 307.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. ప్రస్తుత ఏడాదిలో సుమారు 307.37 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. దేశీయంగా ఏడాదికి దాదాపు 200 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి వినియోగం జరుగుతుంది. కాగితంపై చూస్తే ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువే. అయినా ధరలు పెరుగుతున్నాయి. కారణం ఉల్లి మార్కెట్‌లో ఉత్పత్తి పరిమాణం ఒక్కటే నిర్ణయాత్మకం కాదు.

ఎప్పుడు పంట మార్కెట్‌కు వస్తుంది? ఎంతకాలం నిల్వ చేయగలం? నిల్వలో ఎంత నష్టం జరుగుతుంది? అవసరమైన సమయంలో ఎంత పరిమాణం మార్కెట్‌కు విడుదలవుతుంది? ఇవే ధరలను ప్రభావితం చేస్తాయి. దేశంలో ఉల్లి పంట ప్రధానంగా మూడు సీజన్లలో వస్తుంది. రబీ పంట మార్చి నుంచి మే మధ్య వస్తుంది. మొత్తం ఉల్లి ఉత్పత్తిలో దాదాపు 70 శాతం ఈ పంట నుంచే వస్తుంది. దీనిని నాలుగు నుంచి ఐదు నెలల వరకు నిల్వ చేయగలగడం ప్రత్యేకత. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వస్తుంది. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 20 శాతం దీని వాటా. అయితే ఎక్కువ కాలం నిల్వ చేయడం సాధ్యం కాదు.

జనవరి నుంచి మార్చి మధ్య వచ్చే లేట్ ఖరీఫ్ పంట వాటా సుమారు 10 శాతం. ఇది ఖరీఫ్ కంటే కొంత ఎక్కువకాలం నిల్వ ఉండగలిగినా దీర్ఘకాల నిల్వకు అనుకూలం కాదు. దేశంలో నెలకు సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి వినియోగం జరుగుతుంది. ఇది దాదాపు 3.4 కోట్ల 50 కిలోల బస్తాలకు సమానం. డిమాండ్ మాత్రం ఏడాది పొడవునా దాదాపు ఒకేలా ఉంటుంది. సరఫరా మాత్రం సీజన్‌ ప్రకారం మారుతుంది. ముఖ్యంగా మే-జూన్ నుంచి అక్టోబర్- నవంబర్ వరకు రబీ ఉల్లి నిల్వలపైనే దేశంలోని భారీ వినియోగం ఆధారపడుతుంది.

అందువల్ల రబీ పంటకు వర్షం, ఎండ, కోత సమయంలో నష్టం, నిల్వ సమస్యలు ఎదురైతే దాని ప్రభావం నెలల తర్వాత మార్కెట్‌లో కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా రబీ పంట కోత సమయంలో అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయని కేంద్రం చెబుతోంది. మహారాష్ట్రలో ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలు ఉల్లి ఉత్పత్తి, నాణ్యత, నిల్వలపై ప్రభావం చూపాయని రైతులు చెబుతున్నారు. మహారాష్ట్ర దేశ ఉల్లి ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంది. అక్కడ జరిగే పరిణామాలు దేశవ్యాప్తంగా ధరలపై ప్రభావం చూపుతాయి.

రైతు పండిస్తాడు.. వ్యాపారి ధర నిర్ణయిస్తాడా?

ఉల్లి ధరల కథలో అత్యంత బాధాకరమైన అంశం రైతు పరిస్థితి. ఒక సీజన్‌లో ధరలు పడిపోతే రైతు తీవ్రంగా నష్టపోతాడు. అదే ధరల పతనం తర్వాతి సీజన్‌లో సాగు తగ్గుతుంది. ఉల్లి కొరత ఏర్పడుతుంది. ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు రైతులు ఎక్కువగా సాగు చేయడానికి ముందుకు వస్తారు. తదుపరి సీజన్‌లో ఉల్లి సరఫరా పెరిగి ధరలు మళ్లీ పడిపోతాయి. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో దీనిని కాబ్‌ వెబ్ సైకిల్ గా పిలుస్తారు. రైతు గత ఏడాది ధరను చూసి ఈ ఏడాది ఎంత పంట వేయాలో నిర్ణయిస్తాడు.

గత సీజన్‌లో ఉల్లి ధరలు బాగా పడిపోయాయనుకోండి. రైతు సాగు తగ్గిస్తాడు. అందరూ అదే నిర్ణయం తీసుకుంటే ఉత్పత్తి తగ్గుతుంది. మార్కెట్‌లో సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిన వెంటనే రైతులు ఉల్లి సాగు పెంచుతారు. అందరూ ఒకేసారి ఎక్కువగా పండిస్తే తదుపరి దశలో సరఫరా పెరిగి ధరలు కుప్పకూలుతాయి. రైతు ఎప్పుడూ ధరల చక్రంలో చిక్కుకున్నట్టే ఉంటుంది. మరో సమస్య నిల్వ. దేశంలో ఇప్పటికీ చాలా మంది రైతులు ఆధునిక కోల్డ్ స్టోరేజీ వ్యవస్థలకు బదులుగా సంప్రదాయ పద్ధతుల్లో ఉల్లిని నిల్వ చేస్తున్నారు.

గాలి ఆడే షెడ్లలో నేలపై ఉల్లిని నిల్వ చేస్తారు. కాలం గడిచే కొద్దీ ఉల్లి పాడవుతుంది. బరువు తగ్గుతుంది. వాతావరణం అనుకూలంగా లేకపోతే నష్టం మరింత పెరుగుతుంది. రైతు వద్ద పంట ఉన్న సమయంలో ధర తక్కువగా ఉంటే నిల్వ చేయాలని చూస్తాడు. కానీ నిల్వ ఖర్చు, నష్టం భరించే శక్తి లేకపోతే తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి అదే ఉల్లి అనేక చేతులు మారుతుంది. రైతుకు వచ్చిన ధరకు వినియోగదారుడు చెల్లించే ధరకు భారీ తేడా కనిపిస్తుంది. రైతు రూ.30-35కు అమ్మిన ఉల్లి వినియోగదారుడికి రూ.70-80కు చేరే పరిస్థితి ఎందుకు వస్తోంది? దీనిపై ఇప్పటికే ప్రశ్నలు వచ్చాయి.

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఒక అధ్యయనంలో రైతుల నుంచి కిలోకు రూ.34కు కొనుగోలు చేసిన ఉల్లి వినియోగదారుడికి రూ.80కు అమ్మిన సందర్భం నమోదైంది. అంటే ధర పెరుగుదలలో ఉత్పత్తి స్థాయి మాత్రమే కాదు.. సరఫరా గొలుసులోని ప్రతి దశ కీలకం. వ్యాపారులు నిల్వ చేయడం, మార్కెట్‌కు సరఫరాను ఆలస్యం చేయడం, రవాణా ఖర్చులు, మార్కెట్ మార్జిన్లు, డిమాండ్-సరఫరా అంచనాలు ధరను ప్రభావితం చేస్తాయి. హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌పై అనుమానాలు వచ్చిన ప్రతిసారీ సామాన్యుడి భారం పెరుగుతుంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు ధరల మధ్య అంతరం తగ్గించకుండా కేవలం రైతు ఉత్పత్తి పెంచమని చెప్పడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

రూ. 35 ఉల్లి.. కేంద్రం పరుగులు ఎందుకు?

ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తన బఫర్ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. 2026 కోసం కేంద్రం 1.21 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను సిద్ధం చేసింది. అయితే ధరల నియంత్రణ కోసం ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల రబీ ఉల్లి నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాఫెడ్, ఎన్‌ సీసీ ఎఫ్ సంస్థలు కలిసి 1.21 లక్షల టన్నులు మాత్రమే సేకరించగలిగాయి. అంటే లక్ష్యంలో దాదాపు 40 శాతం కొరత ఏర్పడింది. ఇదే సమయంలో నిల్వ ఉల్లిలో 30 శాతం వరకు పాడైందనే వార్తలు వచ్చాయి.

సాధారణంగా నిల్వలో సుమారు 20 శాతం వరకు నష్టం జరుగుతుందని చెబుతారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధిక స్థాయిలో నిల్వలు పాడయ్యాయన్న వార్తలను ఖండించింది. ఇప్పుడు మిగిలిన బఫర్ స్టాక్‌ను ధరలు ఎక్కువగా ఉన్న నగరాలకు తరలిస్తున్నారు. కిలో రూ.35కే ఉల్లిని విక్రయించడం కేంద్ర జోక్యంలో ప్రధాన చర్యగా మారింది. ఢిల్లీ-ఎన్‌ సీఆర్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా వంటి ప్రాంతాల్లో ఈ విక్రయాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆసక్తికి అనుగుణంగా ప్రభుత్వ దుకాణాలు, మొబైల్ వాన్లు, సహకార సంఘాలు, స్థానిక సంస్థలు గుర్తించిన ఇతర కేంద్రాల ద్వారా ఉల్లి విక్రయిస్తున్నారు.

కేంద్ర గిడ్డంగుల సంస్థ ఉల్లిని సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి రాష్ట్రాలకు తరలించే బాధ్యతను నిర్వహిస్తోంది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ సంస్థలు కూడా మార్కెట్ జోక్యంలో కీలకంగా ఉన్నాయి. ఎన్‌ సీసీఎఫ్ ఇప్పటివరకు 1,500 టన్నుల బఫర్ ఉల్లిని విక్రయించినట్టు సంస్థ ఎండీ అనీస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. మొత్తం 17 నగరాల్లో మొదటి పది రోజుల్లో సుమారు 4,000 టన్నుల బఫర్ ఉల్లి విక్రయించినట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. ధరలను తగ్గించేందుకు ప్రత్యేక రైలు సేవను కూడా ఉపయోగిస్తున్నారు.

దీనికి కందా ఎక్స్‌ ప్రెస్ అని పేరు పెట్టారు. నాసిక్ ప్రాంతం నుంచి ఢిల్లీ, చెన్నై, మదురై, కొచ్చి, గువాహటి వంటి ప్రధాన నగరాలకు ఉల్లిని వేగంగా తరలించేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఆగస్టు 28న కందా ఎక్స్‌ ప్రెస్ ద్వారా 453.65 టన్నుల ఉల్లి ఢిల్లీకి చేరింది. ఆగస్టు 31న 840 టన్నుల ఉల్లి చెన్నైకి చేరింది. గువాహటికి పంపేందుకు మూడో రేక్‌ను సిద్ధం చేస్తున్నారు. రోడ్డు మార్గంలో కూడా సుమారు 1,000 టన్నుల ఉల్లిని పలు నగరాలకు తరలిస్తున్నారు. గత ఏడాది 16 నగరాలకు 86 సరుకు రైళ్ల ద్వారా 88 వేల టన్నుల ఉల్లిని తరలించారు. 2024లో 14 సరుకు రైళ్ల ద్వారా సుమారు 12 వేల టన్నులు తరలించారు. అంటే ప్రభుత్వం ఈసారి సరఫరా వ్యవస్థను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.

ధర తగ్గిందా.. లేక మంట ఇంకా ఉందా?

ప్రభుత్వం రూ.35కే ఉల్లిని విక్రయిస్తున్నా దేశవ్యాప్తంగా ధరలు మాత్రం వెంటనే అదుపులోకి రాలేదు. కేంద్రం జోక్యంతో కొన్ని ప్రాంతాల్లో కిలోకు రూ.2-3 వరకు ధర తగ్గిందని ఎన్‌ సీసీఎఫ్ చెబుతోంది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి కూడా బఫర్ ఉల్లి పంపిణీతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. కానీ జాతీయ సగటు ధరను చూస్తే పరిస్థితి పూర్తిగా మారలేదు. ఆగస్టు 28న రూ.48.50గా ఉన్న సగటు రిటైల్ ధర సెప్టెంబర్ 5 నాటికి రూ.50.79కు చేరింది.

చెన్నైలో రూ.63, ఢిల్లీలో రూ.58 ధర ఉండటం సామాన్యుడిపై పడుతున్న భారాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అంటే ప్రభుత్వం మార్కెట్‌లోకి ఉల్లి విడుదల చేస్తోంది.. కానీ మొత్తం మార్కెట్‌ను ప్రభావితం చేసేంత పరిమాణంలో సరఫరా ఇంకా పెరగలేదు. బఫర్ స్టాక్ పరిమితంగా ఉండటం ఒక కారణం. మరోవైపు కొత్త ఖరీఫ్ పంట ఇంకా మార్కెట్‌లోకి పూర్తిగా రాలేదు. అధికారులు మాత్రం కొత్త ఖరీఫ్ పంటపై ఆశావహంగా ఉన్నారు. అక్టోబర్ మధ్య నుంచి కొత్త ఉల్లి మార్కెట్‌కు రావడం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. సరఫరా పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గవచ్చు.

లాసల్‌ గావ్ ఏపీఎంసీ దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్లలో ఒకటి. అక్కడి నిపుణుల అభిప్రాయం ప్రకారం గత నాలుగు-ఐదు నెలల్లో ఉల్లి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. మార్కెట్‌కు వస్తున్న పరిమాణం ప్రస్తుతం తక్కువగా ఉండటంతో మరో కొన్ని వారాలు ధరలు అధికంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి వారాల్లో ఖరీఫ్ ఉల్లి రాక మొదలవుతుంది. దాంతో సరఫరా పెరిగి ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది.

అయితే ఈసారి ఖరీఫ్ సాగు తగ్గినట్టు వస్తున్న అంచనాలు ధరలు ఎంత మేరకు తగ్గుతాయన్న దానిపై సందేహాలు కలిగిస్తున్నాయి. మరోవైపు రబీ ఉల్లి సాధారణంగా దీపావళి సమయానికి మార్కెట్‌లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఖరీఫ్ ఉల్లి సరఫరా పెరుగుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే అక్టోబర్, నవంబర్‌లో ధరలకు కొంత ఉపశమనం రావచ్చు. కానీ తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం చేస్తున్న విక్రయాలు ఎంతకాలం కొనసాగుతాయి? బఫర్ స్టాక్ ఎంతమేర అందుబాటులో ఉంటుంది? కొత్త పంట మార్కెట్‌కు ఎంత పరిమాణంలో వస్తుంది? ఇవే కీలక ప్రశ్నలు.

ఉల్లి ధర.. రాజకీయాలకు పాత గాయం

ఉల్లి కథ ఆర్థిక సమస్యతో ఆగిపోదు. భారత రాజకీయాల్లో ఉల్లి ధరలకు ప్రత్యేక చరిత్ర ఉంది. వంటింటి ఖర్చును నేరుగా ప్రభావితం చేసే వస్తువు కావడంతో ధర పెరిగితే దాని ప్రభావం సామాన్యుడి అసంతృప్తిపై వేగంగా కనిపిస్తుంది. గత ఐదు దశాబ్దాల్లో ఉల్లి ధరలు పలు ఎన్నికల ఫలితాలపై రాజకీయ ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. 1980 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉల్లి ధరల ప్రభావం అంతగా కనిపించడంతో ఆ ఎన్నికను 'ఉల్లి ఎన్నిక' గా కూడా అభివర్ణించారు.

జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడంలో ఉల్లి ధరల అంశం కూడా చర్చకు వచ్చింది. 1998 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిలో ఉల్లి రూ.40-50 వరకు చేరింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసింది. 2013లో ఉల్లి ధరలు కిలోకు రూ.100 వరకు వెళ్లాయి. దాని తర్వాత జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఓడిపోయింది. ఉల్లి ధరలు పెరిగితే రాజకీయ ప్రమాదం ఎందుకు పెరుగుతుందో ఈ చరిత్ర చెబుతోంది.

2024లో కూడా ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వెలుపల ఉల్లి దండలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కావాలి. వినియోగదారుడికి అందుబాటు ధర కావాలి. ప్రభుత్వం ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. ఎన్నికలు లేని సమయంలో ధరల సమస్యకు రాజకీయ వేడి కొంత తక్కువగా కనిపించవచ్చు.

కానీ వంటింటి ఖర్చు పెరిగినప్పుడు ప్రజల అసంతృప్తి మాత్రం ఎన్నికల క్యాలెండర్‌ను చూసి ఆగదు. ఉల్లి ధర కేవలం కూరగాయ ధర కాదు.. ఇంటి నెలవారీ బడ్జెట్‌పై పడే ప్రత్యక్ష భారం. రైతు పండించినప్పుడు ధర రాకపోవడం, వినియోగదారుడు కొనేటప్పుడు అధిక ధర చెల్లించాల్సి రావడం మధ్యలోని వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతోంది. ప్రభుత్వం బఫర్ స్టాక్ పెంచాలి. నిల్వ సదుపాయాలను ఆధునికీకరించాలి.

పంట కోత సమయంలో వాతావరణ నష్టాలను తగ్గించే చర్యలు తీసుకోవాలి. రైతుకు సరైన మార్కెట్ సమాచారం అందాలి. రైతు నేరుగా పెద్ద మార్కెట్లకు చేరుకునే మార్గాలు బలపడాలి. నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలను కట్టడి చేయాలి. ఉల్లి ధరలు పెరిగినప్పుడే మార్కెట్‌లోకి వచ్చి తాత్కాలికంగా రూ.35కు అమ్మడం ఒక్కటే పరిష్కారం కాదు. రైతుకు గిట్టుబాటు ధర.. వినియోగదారుడికి అందుబాటు ధర.. మధ్యవర్తిత్వం తగ్గిన పారదర్శక మార్కెట్.. దీర్ఘకాలిక నిల్వ వ్యవస్థ ఇవన్నీ కలిసినప్పుడే ఉల్లి సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది.

onion Soaring prices bring tears to farmers too Price crosses 60 per kg shock for the common man

ప్రస్తుతం కేంద్రం బఫర్ ఉల్లిని 17 నగరాలకు తరలిస్తోంది. అక్టోబర్ మధ్య నుంచి కొత్త ఖరీఫ్ పంట రాకతో సరఫరా పెరుగుతుందని ఆశిస్తోంది. అప్పటివరకు ఉల్లి ధరల మంట ఎంత తగ్గుతుంది అన్నదే ఇప్పుడు సామాన్యుడి ఎదురుచూపు. ఎందుకంటే ఉల్లి ధర పెరిగిన ప్రతిసారి కన్నీళ్లు రైతు కళ్లలో మాత్రమే రావు. చివరికి ఆ ప్రభావం సామాన్యుడి వంటింట్లో కూడా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+