ఇదెక్కడి సంప్రదాయం- ఎంత చెప్పినా మీరు మారరా: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు..!!
రక్షణశాఖలో అమలు చేయదలిచిన వన్ ర్యాంక్ వన్ పింఛన్ సౌకర్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో నోట్ పంపించడాన్ని తప్పుపట్టింది. సీల్డ్ కవర్ ను స్వీకరించడానికి నిరాకరించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు భావిస్తోన్న వన్ ర్యాంక్ వన్ పింఛన్ (OROP) సౌకర్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవ్వాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీన్ని అమలు తీరుపై సీల్డ్ కవర్ (Sealed Cover)లో నోట్ పంపించడాన్ని తప్పు పట్టింది. సీల్డ్ కవర్ లో, గోప్యంగా దాన్ని తమకు అందజేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. వన్ ర్యాంక్ వన్ పింఛన్ (One Rank One Pension) అమలు విషయంలో పారదర్శకతను పాటించట్లేదా? అంటూ నిలదీసింది.

అదాని వ్యవహారంలోనూ..
ఇదివరకు గౌతమ్ అదాని (Gautam Adani) సారథ్యంలోని అదాని (Adani) గ్రూప్ ఆఫ్ కంపెనీలపై హిండెన్ బర్గ్ (Hindenburg) రీసెర్చ్ ఇచ్చిన నివేదిక విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో తన అఫిడవిట్ ను పంపించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే. లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలు, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ సంప్రదాయాన్ని పాటించడం పట్ల మండిపడింది. పారదర్శకతను ప్రశ్నించింది.

వన్ ర్యాంక్ వన్ పింఛన్ పై
ఇప్పుడు తాజాగా- అత్యంత కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖలో అమలు చేయదలిచిన వన్ ర్యాంక్ వన్ పింఛన్ పైనా కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ సీల్డ్ కవర్ ను తాము స్వీకరించట్లేదని తేల్చి చెప్పింది. సీల్డ్ కవర్ల సంప్రదాయం- జ్యుడీషియరీ వ్యవస్థకు పూర్తి విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనికి పుల్ స్టాప్ పెట్టాలని తాము యోచిస్తున్నట్లు కుండబద్దలు కొట్టింది.

స్వీకరణకు నిరాకరణ..
వన్ ర్యాంక్ వన్ పింఛన్ పై దాఖలైన పిటీషన్లు ఇవ్వాళ మరోసారి విచారణకు వచ్చాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) సారధ్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ మొదలు పెట్టింది. ఆ వెంటనే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి (AG R Venkataramani) కేంద్ర ప్రభుత్వం తరఫున సీల్డ్ కవర్ నోట్ ను అందజేశారు. దీన్ని స్వీకరించడానికి అక్కడికక్కడే నిరాకరించింది ధర్మాసనం. సీల్డ్ కవర్ సంప్రదాయాన్ని తాము ఇదివరకే వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేసింది.

ప్రాథమిక హక్కులకు విరుద్ధం..
ఎక్స్- సర్వీస్ మెన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హుజెఫా అహ్మదీ వాదించారు. ఇది కాన్ఫిడెన్షియల్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ల కంటేనా? అంటూ ఆయనను ప్రశ్నించారు. సీల్డ్ కవర్లను పంపించడం అంటే పారదర్శకతను పాటించట్లేదనే కదా? అని అన్నారు. ఇది జ్యుడీషియరీ వ్యవస్థ ప్రాథమిక హక్కులకు విరుద్ధమని తేల్చి చెప్పారు సీజేఐ. కేంద్రం ఇచ్చే అభిప్రాయం మీదే తమ తీర్పు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

నోట్ ను చదివి వినిపించిన ఏజీ..
సీల్డ్ కవర్ ను స్వీకరించడానికి ధర్మాసనం అంగీకరించకపోవడంతో అందులో కేంద్రం పంపిన నోట్ ను అటార్నీ జనరల్ చదివి వినిపించారు. 25 లక్షల మంది పెంఛనర్లు ఉన్నారని, వన్ ర్యాంక్ వన్ పింఛన్ కింద వారికి చెల్లించాల్సిన బకాయిలు 2019-2022 ఆర్థిక సంవత్సరానికి గాను 28,000 కోట్ల రూపాయల మేర ఉందని అన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి 5.85 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేంద్రం రక్షణశాఖకు కేటాయించిందని గుర్తు చేశారు. ఇందులో 1.32 లక్షల కోట్ల రూపాయలు ప్రణాళిక బద్ధమైన పింఛన్ల కోసం కేటాయించినట్లు వెంకటరమణి వివరించారు.












Click it and Unblock the Notifications