అంతా నార్మల్: చైనా మంత్రితో జైశంకర్, అజితో ధోవల్ భేటీ: ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్‌పై
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి సాగిస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. భారత్-చైనా సైన్యాధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు నిర్వహించినప్పటికీ కొలిక్కి రావట్లేదు. ఏదో ఒక అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడుతోంది. వాస్తవాధీన రేఖ వివాదంపై కమాండర్ ర్యాంక్ స్థాయి అధికారులు ఇటీవలే నిర్వహించిన చర్చలు కూడా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

2020 నుంచి ఉద్రిక్తత..
లఢక్ సెక్టార్ సమీపంలో గాల్వన్ వ్యాలీ, పాంగ్యాంగ్ లో భారత్-చైనా సైనికుల మధ్య 2020 జూన్‌లో చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటూ వచ్చింది. అంతకుముందు నుంచే అంటే- అదే ఏడాది మేలో భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భద్రత సిబ్బంది మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైన్యాన్ని.. జవాన్లు విజయవంతంగా అడ్డుకున్నారు.

మూడు గంటల పాటు..
అప్పటి నుంచీ లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తోన్నాయి. అవి ఇప్పటికీ చల్లారట్లేదు. ఈ పరిణామాల మధ్య చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మూడు గంటల పాటు వారి మధ్య చర్చలు సాగాయి.

సరిహద్దుల్లో కొంత అసాధారణ పరిస్థితులు..
వాస్తవాధీన రేఖ వివాదం చెలరేగిన తరువాత చైనాకు చెందిన ఓ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఈ భేటీ ముగిసిన అనంతరం జైశంకర్ విలేకరులతో మాట్లాడారు. చర్చల సారాంశాన్ని వెల్లడించారు. చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతానికి అంతా నార్మల్‌గానే ఉందని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితులు సాధారణంగా లేవని, కొంత ఉద్రిక్తంగా ఉన్నాయని అన్నారు.

క్వాడ్ మీటింగ్..
దీన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్యాంగ్యాంగ్ ట్సొ వద్ద ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, సైన్యాన్ని ఉపసంహరించుకునేలా చేయడానికి ఇప్పటిదాకా 15 విడతల్లో చైనాతో ఆర్మీ అధికారులు చర్చలు జరిపారని జైశంకర్ గుర్తు చేశారు. క్వాడ్ మీటింగ్‌కు సంబంధించిన అంశాలేవీ చైనా విదేశాంగ మంత్రి భేటీలో ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు.

ఉక్రెయిన్, ఆఫ్ఘన్ సహా..
రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకున్న పరిణామాల గురించీ చర్చించామని జైశంకర్ వివరించారు. అన్ని విషయాలపైనా సుహృద్భావ వాతావరణంలో చర్చించామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న సంఘటనలు తమ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని జైశంకర్ వ్యాఖ్యానించారు.

యుద్ధం ముగించడానికి..
ఆఫ్ఘనిస్తాన్‌పై భారత విధానాల్లో పెద్దగా మార్పేమీ లేదని చైనాకు స్పష్టం చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఆమోదించిన 2593 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో మాత్రం తాము ఎలాంటి వైఖరిని అనుసరిస్తోన్నామనేది ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు. యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు, దౌత్యపరంగా ప్రయత్నించాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications