ఢిల్లీ జైళ్లలో కరోనా టెన్షన్.. 180కిపైగా పాజిటివ్ కేసులు
ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. జైళ్లకు కూడా ఈ వైరస్ పాకింది. ఢిల్లీలోని వివిధ జైళ్లలో 180 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ.. 50-100 పడకల మెడికల్ సెంటర్లను జైళ్లలోనే ఏర్పాటు చేసింది. కరోనా సోకిన ఖైదీలకు అక్కడే డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జైళ్లలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు.

కరోనా కేర్ సెంటర్స్‌గా డిస్పెన్సరీలు..
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వివిధ జైళ్లలో 99 మంది ఖైదీలు, 88 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన జైళ్ల శాఖ కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. జైళ్లలో ఉన్న డిస్పెన్సరీలను కరోనా కేర్ సెంటర్స్ గా మారుస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ తెలిపారు. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేవని వెల్లడించారు.

తిహాడ్ జైల్లో ఉన్న 120 పడకల ఆస్పత్రి
గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి 15వ తేది వరకు రోహిణి, తీహాడ్, మండోలి జైళ్లలో మొత్తం 188 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమై అధికార యంత్రాంగం కరోనా సోకిన వారందరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు జైలు డాక్టర్లు. తిహాడ్ జైల్లో ఉన్న 120 పడకల ఆస్పత్రిలో కరోనా బాధితులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీలో కాస్త తగ్గికి కరోనా కేసులు
ఢిల్లీలో కరోనా కట్టడికి ముందస్తు ఆంక్షలు, వారాంతరపు కర్ఫ్యూ దోహదం చేస్తోంది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 18,286 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. శనివారంతో పోలిస్తే 13 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 28 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 89,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు వారి కేసులు 15 వేలకు తగ్గితే ఆంక్షల సడలింపుపై ఆలోచన చేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.