నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్
ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వేసవి సెలవులు నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో భక్తులు మల్లన్నను దర్వించుకుంటోన్నారు. దీంతో వారికి కల్పించే సౌకర్యాలు, స్పర్శ దర్శనం టికెట్లకు సంబంధించిన అంశాలపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు.
ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్‌లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు.

రద్దీ అధికంగా కావడం వల్ల ఈ విధానాల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి నుంచి జూన్ 1వ తేది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నారు. వారాంతపు సెలవులు కావడంతో పాటు వేసవి ముగింపు దశకు రావడంతో శ్రీశైలానికి సాధారణ భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకే వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. బ్రేక్ దర్శనాలు నిలిపివేసిన ఈ మూడు రోజుల పాటు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. గర్భాలయ ప్రవేశం కానీ, శివలింగాన్ని తాకే అవకాశం కానీ సాధారణ భక్తులకు ఉండదు. ఈ నిబంధన కరెంట్ బుకింగ్స్, వీఐపీ సిఫారసు లేఖలపై వచ్చే వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటికే ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతరం మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేసేలా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకు లడ్డూ ప్రసాదం కొరత రాకుండా అదనపు కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications