వావ్.. ఒక్కరోజే 80.96 లక్షల టీకాలు, హైయస్ట్ ఇక్కడే..
కరోనాకు విరుగుడు వ్యాక్సినే. ఇవాళ్టి (21వ తేదీ) నుంచి 18 ఏళ్లు నిండినవారికి ఉచితంగా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించారు. దీనికి జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఒక్కరోజే 80.96 లక్షల మంది టీకా తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను వెల్లడించారు. ఇదివరకు ఏప్రిల్‌లో 43 లక్షల మంది తీసుకోగా.. ఇవాళ ఆ రికార్డును బ్రేక్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28.7 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

50 శాతం ఇక్కడే
ఇవాళ 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు 55 లక్షల మంది వచ్చి టీకా తీసుకున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాలో 50 శాతం వ్యాక్సిన్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 10 లక్షల టీకాలు తీసుకుంటారని అనుకుంటే.. 15 లక్షల మందికి అందజేశారు. ఇవాళ 68 వేల వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటకలో 8 వేల చొప్పున, యూపీలో 8500 నెలకొల్పారు. హర్యానాలో 2.5 లక్షలు, గుజరాత్‌లో 5 లక్షలు, కర్ణాటకలో 10 లక్షలు, యూపీ 6.6 లక్షలు టీకాలు తీసుకున్నారు.

కేంద్రమే అంతా..
వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. గతంలో రాష్ట్రాలే టీకాలు సమకూర్చుకోవాలని తెలిపిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కొరత.. కానీ
రాష్ట్రాలే టీకాలు సమకూర్చుకోవాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పైగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా విక్రయించేందుకు నిరాకరించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది.












Click it and Unblock the Notifications