అయ్యప్ప స్వాముల కారుకు భారీ ప్రమాదం- 100 మీటర్ల ఎత్తు నుంచి కిందికి.. నలుగురు దుర్మరణం
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. తొలి వారంలోనే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 10 లక్షలు దాటింది.
భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ వేకువ జామున శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు కేరళ వండూర్ సమీపంలోని అంబలపాడి మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన ప్రదీప్ కుమార్, ధర్మేష్, సంజయ్, ధృవరాజ్, నిఖిల్ ఉన్నారు. వీరికి స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

అదే సమయంలో కర్ణాటకలో మరో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అయ్యప్ప స్వాములు మరణించారు. వారిని చెన్నైకి చెందిన గోపీ, గౌతమ్ రమేష్, హరిహరన్, జయంకర్ గా గుర్తించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న అదుపు తప్పి కారు నంబర్ టీఎన్ 14 టీ 4801 డివైడర్‌ను ఢీకొని వంతెన పైనుంచి కిందపడటంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందిన వెంటనే మాలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం, నిద్రమత్తు వల్ల కారు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి కారు కింద పడిందని, తొలుత ఫ్లైఓవర్ సైడ్ వాల్స్ ను ఢీ కొట్టి, అదే వేగంతో కిందికి పడిందని వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications