వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ వరదలు: 'ఇల్లు కోల్పోయాం, ఇప్పుడు బిడ్డని కోల్పోతామని భయంగా ఉంది'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్ వరదలు

"నా బిడ్డ బాధలు పడుతుంటే చూసి తట్టుకోలేను".. 10 నెలల సయీద్ అహ్మద్‌ను ఒళ్లో పెట్టుకుని ఊపుతూ చెప్పారు నూర్ జాది.

పాకిస్తాన్ వరదల్లో ఆమె తన ఇంటిని కోల్పోయారు. ఇప్పుడు ఆమె తన బిడ్డ గురించి భయపడుతున్నారు.

"మేం పేదవాళ్లం. బిడ్డ గురించి చాలా బెంగగా ఉంది" అన్నారామె.

సయీద్ చీలమండకు కాన్యులా పెట్టారు డాక్టర్. ఆ చిన్న పాదానికి సూది గుచ్చుతుంటే ఏడ్చాడు.

సయీద్‌కు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాలి. బాబుకు తీవ్రమైన మలేరియా సోకింది.

ఓవైపు వరదల కారణంగా ఆశ్రయం కోల్పోయారు. ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితి బాలేదు. ఇలా రెట్టింపు కష్టాలు పడుతున్న వేలాదిమందిలో నూర్ ఒకరు.

పాకిస్తాన్‌లో ఘోరమైన వరదలు ఎన్నో జీవితాలను అతలాకుతలం చేశాయి. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న సింధ్ ప్రాంతంలో మలేరియా, డెంగీ, డయేరియా కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. నిరాశ్రయులైన ప్రజలు మురికిగుంటల పక్కనే జీవనం సాగిస్తున్నారు. దాంతో, ఈ వ్యాధులు విజృంభిస్తున్నాయని అంటున్నారు.

తట్టా జిల్లా ఆస్పత్రిలో అత్యవసర వార్డులో సయీద్ లాంటి ఎంతోమంది పసిపిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో నూర్ పక్కనే మరో తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి దిగులుపడుతూ కూర్చున్నారు. ఆమె బిడ్డకు డ్రిప్స్ ఎక్కిస్తున్నారు.

ఆ వార్డులో అందరూ చిన్నపిల్లలే. దాదాపు అందరూ వరదల కారణంగా అనారోగ్యం పాలైనవారేనని డాక్టర్ అష్ఫాక్ అహ్మద్ చెప్పారు. ఆయన అదే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. మలేరియాను తగ్గించే మందుల కొరత బాగా ఉందని ఆయన చెప్పారు.

మరో బెడ్‌పై షయిస్తా అనే మహిళ కదలకుండా పడుకుని ఉన్నారు. ఆమె ఏడు నెలల గర్భిణి. ఆమె కూడా వరద ప్రాంతాల నుంచి వచ్చినవారే. షయిస్తా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, మరో పెద్ద ఆస్పత్రికి ఆమెను తరలిస్తున్నారని డాక్టర్ అహ్మద్ చెప్పారు.

పాకిస్తాన్ వరదలు

అక్కడికి రోగులు వస్తూనే ఉన్నారు. ప్రతి అయిదు, పది నిమిషాలకు ఒక రోగి అడ్మిట్ అవుతున్నారు.

గులాం ముస్తఫా తన రెండేళ్ల మనవరాలు సైమాను అక్కడకు తీసుకువచ్చారు.

"మా ఇల్లు వరద నీటితో నిండిపోయింది. మేము సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నాం. పాపను శిబిరంలో డాక్టరుకు చూపించాం కానీ, లాభం లేకపోయింది. అందుకే ఇక్కడకి తీసుకువచ్చాను" అని చెప్పారు ముస్తఫా.

అయితే, అందరికీ ఆస్పత్రి సదుపాయాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అక్కడకు అరగంట దూరంలో ఉన్న డండమా ప్రాంతంలోని సహాయ శిబిరాల్లో వేలాదిమంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.

ఆ దారంతా వరద నీటితో నిండిపోయింది. ఇళ్ల పైకప్పులు నీటిలో తేలుతూ కనిపించాయి.

చెరువు పక్కనే చిన్న చిన్న గుడారాలు వేసి ఉన్నాయి. అవి గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నాయి. రెండు కర్రలకు గుడ్డలు లేదా ప్లాస్టిక్ షీట్లు కట్టి రాళ్లు దన్నుగా పెట్టారు. అక్కడ ఎంతోమంది వరద బాధితులు అశ్రయం పొందుతున్నారు.

పాకిస్తాన్ వరదలు

మేం శిబిరం దగ్గరకు వెళుతుంటే జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్మల్ని డాక్టర్లు అనుకున్నారు.

ఒక మహిళ చేతుల్లో బాబును పట్టుకుని వచ్చారు. చాలా రోజులుగా ఆ బాబుకు జ్వరంగా ఉంది. ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు.

ఒక టెంట్‌లో రషీదా అనే మహిళ కనిపించారు. ఆమెకు ఏడుగురు పిల్లలు. నలుగురికి ఒంట్లో బాలేదు. పైగా ఆమె గర్భవతి. పుట్టబోయే బిడ్డ గురించి ఆమె దిగులుపడుతున్నారు. పిల్లలని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లడానికి డబ్బులు లేవని ఆమె చెప్పారు.

"వాళ్లకి జ్వరంగా ఉంది. వాంతులు అవుతున్నాయి. దోమలు బాగా కుట్టాయి. పాల కోసం బిడ్డలు ఏడుస్తున్నారు" అని చెప్పారామె.

అధికారుల నుంచి తనకు ఎలాంటి ఆహార పంపిణీ, ఆశ్రయం (టెంట్) అందలేదని రషీదా చెప్పారు. అక్కడున్న చాలామంది ఇదే మాట చెప్పారు. తమను పట్టించుకోకుండా వదిలేశారని వారు భావిస్తున్నారు.

పాకిస్తాన్ వరదలు

తట్టాలోని సీనియర్ ప్రభుత్వ అధికారి డాక్టర్ గజన్‌ఫర్ ఖాద్రీ, టెంట్ల కొరత ఉందని అంగీకరించారు. కానీ, సాధ్యమైనంతవరకు బాధిత ప్రాంతాలకు ఆహార పంపిణీ చేశారని చెప్పారు.

"నాకు తెలిసినంతవరకు ఈ ప్రాంతంలో అన్ని మూలలకూ రేషన్ పంపించాం. ఒకటో, రెండో మిస్ అయుండవచ్చు" అని ఖాద్రీ బీబీసీతో చెప్పారు.

అయితే, ఈ భరోసా రషీదా లాంటి వాళ్లకు ఏ మాత్రం సరిపోదు.

నదులు, చెరువుల్లో నీటి మట్టాలు తగ్గడానికి కొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అక్కడ పొంగుతున్న చెరువు వైపు చూపిస్తూ దాని పక్కనే ఉండేవాళ్లమని రషీదా చెప్పారు.

"మా ఇల్లు వరద నీటిలో కొట్టుకుపోయింది. మాకేం మిగల్లేదు" అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan floods: 'We lost our home, now we fear losing our child'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X