వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పల్నాడు ఉత్సవాలు: నాయకురాలు నాగమ్మ విగ్రహం

తెలుగునాడు చరిత్రలో ప్రముఖంగా వినిపించే పల్నాడు గురించి తగిన పరిశోధనలు జరగలేదన్నది పలువురు చరిత్రకారుల అభిప్రాయం. తొలుత శ్రీనాథుడు నుంచి ఆ తర్వాత సీపీ బ్రౌన్ వరకూ కొంత ప్రయత్నం జరిగినా పల్నాడు చరిత్రకు పూర్తి వివరణాత్మక పరిశోధన జరగలేదనే వాదన నేటికీ ఉంది.

అయితే, ఏటా పల్నాడు ఉత్సవాల నిర్వహణ మాత్రం సాగుతోంది. చాపకూడు సహా వివిధ ఆనవాయితీలను కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. వాటి వెనుక కథ ఏంటి, పల్నాడు అనే పేరు ఎలా వచ్చిందనేది మాత్రం ఆసక్తిదాయకం.

'పల్నాడు' అనే ఎందుకు పిలుస్తారు

పల్నాడు అనే పేరు రావడానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. తొలుత పల్లవులు పాలించిన ప్రాంతం కాబట్టి పల్నాడు అన్నారని కొందరు, పలు గ్రామాల సమూహం కనుక పల్నాడు అయ్యిందని ఇంకొందరు చెబుతున్నారు.

అయితే తెలుగునాట వెల్నాడు, పోల్నాడు, వేగినాడు, కోర్నాడు ఇలా అనేక పేర్లున్నాయి. వాటికి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పల్నాడు కూడా అదే పరంపరలో వచ్చిందనే అభిప్రాయం ఉంది. నాడు అంటే ప్రాంతం కాబట్టి వలనాడు అనేది కాలక్రమేణా పల్నాడుగా స్థిరపడిందని చరిత్ర రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.ఆంజనేయులు బీబీసీతో అన్నారు.

పలపలనాడు అంటే బాగా వెలుగొందిన ప్రాంతం కాబట్టి అందులో చివరకు పల్నాడుగా మిగిలి ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

పల్నాడు చరిత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో ఆ పేరుకి కూడా వివిధ భాష్యాలు చెబుతూ ఉంటారు.

పల్నాడు ప్రాంతం ఏది

పల్నాడు ప్రాంతం గురించి కూడా స్పష్టత లేదు. గుంటూరు జిల్లాలోని గురజాల, మాచర్ల ప్రాంతంతో పాటుగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం డివిజన్ లోని కొన్ని గ్రామాలను కూడా కలిపితే పల్నాడుగా చెబుతుంటారు.

అయితే నరసరావుపేటని పల్నాడు ముఖద్వారం అంటూ కొందరు చెబుతున్నప్పటికీ కొండవీడు ప్రాంతంలో ఉన్న నరసరావుపేటకి పల్నాడుతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని చరిత్ర పరిశోధకుడు ఎం.గోపాల్ రెడ్డి వ్యక్తంచేశారు.

గురజాల, మాచర్ల నియోజకవర్గాలుగా ప్రస్తుతం పిలుస్తున్న ప్రాంతాలతో పాటుగా సమీపంలోని పలు గ్రామాలన్నీ పల్నాడు గా పిలుస్తుంటారు.

1962కి ముందు పల్నాడు పేరుతో అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండేది. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి పల్నాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు గురజాల, మాచర్ల నియోజకవర్గ ప్రాంతాలుగా ఉన్న వాటిని పల్నాడు నియోజకవర్గంగా పేర్కొన్నారు.

పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడి విగ్రహం

పల్నాటి చరిత్ర ఇలా మొదలు...

మాహిష్మతిని రాజధానిగా చేసుకుని నర్మదా నదీ తీరంలో హైహయ రాజ్యం ఉండేది. ఆ రాజ్య వంశానికి చెందిన అనుగు రాజు తన శరీరంపై మచ్చలు తొలగించుకోవడం కోసం దక్షిణ భారత యాత్ర చేస్తారు. ఆయన్ని అలుగురాజు అని కూడా అంటారు.

కృష్ణా నది వెంబడి పయనించి పలు చోట్ల నదీ స్నానాలు చేస్తూ సాగుతున్న క్రమంలో మాచర్ల సమీపంలోనూ, ఆ తర్వాత అమరావతి ప్రాంతంలోనూ ఆయన నదీ స్నానం చేయడంతో మచ్చలు తొలగిపోయాయని పల్నాడు చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో ఉంది.

అదే సమయంలో అనుగురాజుని దేశ బహిష్కరణ చేసినందున, ఆయన వెలనాడు ప్రాంతానికి వచ్చి ఉంటారని కొందరు పేర్కొన్నారు.

ఆనాటికి వెలనాడు రాజ్యం ప్రస్తుతం బాపట్ల సమీపంలో ఉన్న చందోలు కేంద్రంగా పాలన సాగించేది. వెలనాటి చోడుల పాలనలో బాపట్ల సమీపంలోని సముద్ర తీరం నుంచి నల్లమలలో ఉన్న అహోబిలం వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉండేది.

వేంగి చాళిక్యులు, చోళులకు కూడా సరిహద్దు రాజ్యంగా ఉండడంతో నిత్యం యుద్ధాల తాకిడి ఉండేది. చివరకు కాకతీయ సామ్రాజ్యం ఆవిర్భవించడంతో వారికి సామంత రాజులుగా 11 వ శతాబ్దం నాటికి 2వ గొంకరాజు పాలనలో వెలనాడు ఉండేది.

ఆ సమయానికి అనుగు రాజు కూడా తన మచ్చలు పోయిన తర్వాత ప్రస్తుతం గురజాలగా పిలుస్తున్న ప్రాంతంలో తాత్కాలికంగా స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో జొన్న కంకులు విషయంలో ఓ రైతుకి అనుగురాజుకి తగాదా వస్తుంది.

ఆ రైతు స్థానికంగా ఉండే రాజ ప్రతినిధులకు ఫిర్యాదు చేస్తారు. వారు ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో అనుగురాజు అనుచరులు వారిపై దాడికి దిగుతారు. చివరకు సమస్యని ఆ భటులు గొంకరాజుకి మొరపెట్టుకుంటారు.

అనుగురాజు తన వద్ద సైన్యం లేదు కాబట్టి మల్లయుద్ధానికి రావాలని గొంకరాజుని కోరడం, ఆయన అంగీకరించడంతో బాహాబాహీకి సిద్ధమవుతారు. అప్పుడు అనుగురాజు తరుపున దొడ్డపనాయుడి కొడుకు పేరినీడు బరిలో దిగి గొంకరాజు తరుపున వచ్చిన చందోలు వీరులను ఓడిస్తారు. మల్లయుద్ధంలో గెలిచిన అనుగురాజుకి గొంకరాజు కుమార్తె మలిదేవి అని పిలిచే అంబని ఇచ్చి వివాహం చేస్తారు.

రేచర్ల వంశానికి చెందిన పేరినీడు, బ్రహ్మనాయుడు సోదరులు కావడం విశేషం. అంతేగాకుండా అనుగరాజుకి తొలుత పిల్లలు లేకపోవడంతో దొడ్డపనాయుడి పెద్దకొడుకు పెద్దన్నను దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత మలిదేవికి నలగామరాజు పుట్టాడు. వారితో పాటు ఇతర భార్యల సంతానం కూడా ఉంటారు.

అనుగురాజు ఆ తర్వాత గురజాల ప్రాంతంలో అరణం కింద దక్కిన 5 ఊర్లకు రాజు అవుతాడు

వీర్లగుడిలో ఉంచిన ఆయుధాలు

పల్నాడు యుద్ధం నేటికీ ప్రత్యేకమే

అనుగురాజుకి దత్తుడిగా ఉన్న పెద్దన్న నాయుడికి వారసత్వం దక్కదు. పెద్దన్న తండ్రి దొడ్డపనాయుడు అనుగురాజు దగ్గర మంత్రిగా ఉంటారు. కానీ మంత్రి కొడుకుని దత్తత తీసుకోవడంతో తనకే రాజ్యం దక్కాలని పెద్దన్న నాయుడు ఆశిస్తారు. ఈ వారసత్వ విషయంలో నలగామరాజు తో పాటుగా నరసింహ, మలిదేవుల మధ్య కూడా మనస్పర్థలు వస్తాయి.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు బ్రహ్మనాయుడు, నాగమ్మ చెరోవైపునా నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం కారంపూడిగా పిలుస్తున్న కార్యంపూడి కేంద్రంగా క్రీ. శ 1176 నుంచి 1182 వరకూ యుద్ధం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. దానినే పల్నాటి యుద్ధంగా భావిస్తారు.

ఈ యుద్ధంలో గెలిచింది నాయకురాలు నాగమ్మ అని కొందరు కీర్తిస్తే, కాదు పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ ఇంకొందరు కొనియాడుతూ ఉంటారు. నేటికీ మాచర్ల ప్రాంతంలో బ్రహ్మనాయుడిని ఆరాధిస్తుంటే, గురజాలలో నాగమ్మని పూజిస్తారు.

నాగమ్మ ప్రస్థానం వెనుక కూడా అనేక ప్రచారాలున్నాయి. ప్రధానంగా నాగమ్మ తన భర్తను కోల్పోయిన తర్వాత మేనమామ ఇంటికి గామాలపాడు వస్తుంది.

ఆమె పుట్టినిల్లు తెలంగాణాలో ఉన్న కొండగట్టు సమీపంలోని ఆరవిల్లి. వారి పొలాన్ని చెరువు తవ్వకం పేరుతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరగడంతో ఆమె ప్రతిఘటిస్తుంది. ఆ తర్వాత రాజుకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆమె ముందు నిలుస్తుంది.

బ్రహ్మనాయుడి వ్యూహాలను ఛేదిస్తూ తన ప్రభువు నలగామరాజునూ, రాజ్యాన్నీ ఆమె కాపాడిందని చెబుతారు. ఆమె తండ్రి రామిరెడ్డి, మామ జగ్గిరెడ్డిని బ్రహ్మనాయుడు మట్టుబెట్టినా ఆమె కత్తిపట్టి యుద్ధం చేసిన ధీరురాలిగా కొనియాడుతారు. ఆమె చొరవ కారణంగానే నలగామరాజు రాజ్యం ముక్కలు కాకుండా అడ్డుకుందని చెబుతారు.

నేటికీ పిచ్చుకగుంట్ల వారు ఊరూరా తిరుగుతూ చెప్పే కథలో నాగమ్మనే కీర్తిస్తారు. యుద్ధంలో బ్రహ్మనాయుడు చనిపోయినట్టు చెబుతారు

బ్రహ్మనాయుడి ఆయుధమని చెప్పే నృసింహ కుంతలము

బ్రహ్మనాయుడి ఆచారం కొనసాగింపు

ఏటా మాచర్ల ప్రాంతంలో నిర్వహించే పల్నాడు ఉత్సవాలు బ్రహ్మనాయుడు ప్రారంభించినవేనని చెబుతారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 3 నుంచి జరుగుతున్నాయి.

బ్రహ్మనాయుడు తన రాజ్యంలో మంత్రిగా ఉంటూ పాలనలో కీలకంగా వ్యవహరించారని చరిత్రకారుల వాదన. ముఖ్యంగా సామాజిక మార్పులో బ్రహ్మనాయుడి ముద్ర చెరిగిపోనిదని కీర్తిస్తారు.

ఆ కాలంలోనే అన్ని కులమతాల వారితో సహపంక్తి భోజనాలు నిర్వహించిన ఆదర్శవాదిగా బ్రహ్మనాయుడిని చెబుతారు. కులమత భేదాలు లేకుండా అంతా కలిసి ఒకే పంక్తిలో చేసే భోజనాలనే చాపకూడు అంటారు. ఇదే చాపకూటి సిద్ధాంతం.

ప్రస్తుతం పల్నాడు ఉత్సవాల్లో కూడా చాపకూడు కొనసాగిస్తుండడం విశేషం.

వైష్ణవ ఆచార్యులైన రామానుజాచార్యులు మొదలైనవారి ప్రభావం బ్రహ్మనాయుడిపై ఎక్కువని ఆయన గురించి రాసిన పుస్తకాల్లో ఉంది. ఆ సిద్ధాంత ప్రభావితమే సంఘ సంస్కర్తగా పలు కార్యక్రమాలకు పురిగొల్పి ఉంటుందని చెబుతారు.

చెన్నకేశవ ఆలయంలో మాలదాసరులను పూజారులుగా నియమించడం ఆయన ఆదర్శ జీవనానికి నిదర్శనమని చెబుతారు. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత గుత్తికొండబిలంలోకి వెళ్లాడని, నేటికీ సజీవంగా అందులోనే తపస్సు చేసుకుంటున్నాడని కొందరు చెబుతుంటారు.

బ్రహ్మనాయుడి వైష్ణవ ఆచారాలకు, శైవులకు మధ్య వైరుధ్యమే పల్నాటి యుద్ధానికి మూలమని కూడా అంటారు.

శ్రీనాథుడి పద్యమే ఆధారం

"చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు '-

అంటూ 16వ శతాబ్దంలో కవి శ్రీనాథుడు చెప్పిన పద్యమే పల్నాడు చరిత్రకు ప్రధాన ఆధారంగా ఉంది.

17వ శతాబ్ది మధ్యభాగంలో జీవించిన ముదిగొండ వీరభద్ర కవి పల్నాటి యుద్ధ చరిత్రను కావ్యంగా రాశారు. సి.పి. బ్రౌన్ వీరుల గాథను తాళపత్ర రూపంలో కొంత సేకరించారు. శ్రీనాధుని రచన మంజరీ ద్విపద కావ్యాన్ని పల్నాటి చరిత్రగా అక్కిరాజు ఉమాకాంతం 1911లో ప్రచురించారు. దానికి కొండయ్య, మల్లయ్య రచనలను కూడా చేర్చి, సంపూర్ణ గ్రంథాన్ని 1961లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ప్రచురించారు.

పల్నాడు చరిత్రను జి.హెచ్. రోఘయిర్ అనే పండితుడు ఇంగ్లీషులోకి అనువదించారు. అయితే అన్నింటికీ శ్రీనాధుని రచనే మూలంగా ఉంటుంది. శాసనాల్లో ఎక్కడా పల్నాడు యుద్ధం ప్రస్తావన కనిపించదు. కానీ ఆనాటి సాహిత్యంలో నుంచి వినిపిస్తున్న కథల ఆధారంగా ఇది ప్రచారం జరుగుతూనే ఉంది.

పల్నాటి యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడి అనుచరులు ఓరుగల్లులో కాకతీయుల కొలువులో చేరడంతో క్రీడాభిరామంలో ఆ వీరోచిత చరిత్ర ప్రస్తావన ఉంటుంది.

పల్నాటి ఉత్సవాలు ప్రతియేటా డిసెంబర్‌లో జరుగుతాయి.

వీరుల గుడిలో పూజలు

కారంపూడిలో యుద్ధం జరిగిన ప్రదేశంలో మరణించిన వీరుల పేరుతో గుడి ఉంది. దానిని వీర్ల గుడి అని పిలుస్తారు. రోమ్ చరిత్ర తర్వాత యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం పల్నాడులోనే ఉంటుందని కొందరు చెబుతుంటారు.

నాగులేటి సమీపాన శంకుతీర్థ మండపం ఉంటుంది. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులకు బ్రహ్మన్న ఇచ్చిన తీర్థం తాగిన తర్వాత వీరత్వం ఉప్పొంగేదనేది ప్రచారంలో ఉంది.

ఇక పలనాటి వీరుల కొణతాల మహోత్సవములు సందర్భంగతా వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుని కారంపూడి పల్నాటి వీరాచారా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ బీబీసీకి తెలిపారు.

కార్తీక అమావాస్య రోజున కారంపూడి వీర్లగుడి ప్రాంగణంలో వీరుల మహోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా 5 రోజులపాటు జరిగే ఉత్సవాల తేదీలను ప్రకటించారు.

  • డిసెంబర్ 3 శుక్రవారం రాచగవు
  • డిసెంబర్ 4 శనివారం రాయబారం
  • డిసెంబర్ 5 ఆదివారం మందపోరు
  • డిసెంబర్ 6 సోమవారం కోడిపోరు
  • డిసెంబర్ 7 మంగళవారం కల్లిపాడు నిర్వహిస్తామని వివరించారు.

ఈ ఆలయం ముస్లిం రాజ్య ప్రతినిధులు జాఫర్, హైదర్ నిర్మించారంటూ వారి సమాధులు కూడా కారంపూడి ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి

"పలనాడు వెలలేని మాగాణిరా " అంటూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే పులుపుల శివయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పల్నాడుగా పేరొందిన ఈ ప్రాంతానికి శతాబ్దాల నాటి చరిత్ర, ఆనాటి యుద్ధ కథలు అంతటి ప్రత్యేకతను తీసుకొచ్చాయని చెప్పవచ్చు.

"బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి

తరలి కారంపూడి ధర్మరణరంగాన

వీరరక్తము చిందెరా, పలనాట

నాగులేరై పారెరా! " .....అంటూ శివయ్య వీర గేయ గాథ జనం నోళ్లలో నేటికీ వినిపిస్తుండడం విశేషమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Palnadu: How did this name come about and what is the story behind the Palnadu festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X