శ్రీనగర్ ఎన్ కౌంటర్: లషర్కే ఉగ్రవాదులు అంతం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ బుధవారం మధ్యాహ్నం తరువాత ముగిసింది. దాదాపు 62 గంటల పాటు సాగిన ఆపరేషన్ లో పారా కమెండోలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేశారు.
ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (ఈడీఐ) హాస్టల్ భవంతిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు భారత ఆర్మీ దెబ్బకు అంతం అయ్యారు. ఎన్ కౌంటర్ లో అంతం అయిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ కు నేతృత్వం వహించిన జీవోసీ విక్టర్ ఫోర్స్ కు చెందిన మేజర్ జనరల్ అశోక్ నరూలా
మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం వేకువ జామున పడవలో జీలం నదిని దాటి వచ్చిన ఉగ్రవాదులు ఈడీఐ భవంతిలో నక్కారని చెప్పారు.
అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కాల్పులు జరిగాయని అన్నారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశారని అన్నారు. ఉగ్రవాదులు ఇద్దరూ లష్కరే -ఏ-తోయిబా గ్రూప్ కు చెందిన వారని వివరించారు.

భవంతిలో మొత్తం 122 గదులు ఉన్నాయని, అణువణువూ తనిఖీ చేస్తున్నామని చెప్పారు. మనవైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మేజర్ జనరల్ అశోక్ నరూలా స్పష్టం చేశారు. పాంపోర్ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు.
మొదట ముగ్గురు ఉగ్రవాదులు ఈడీఐ భవనంలోకి చొరబడ్డారని అనుమానించారు. మోర్టార్ షెల్ష్ తో ప్రతిదాడి చేశారు. చివరికి పారా కమెండోలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను అంతం చేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశారని మేజర్ జనరల్ అశోక్ నరూలా వివరించారు.












Click it and Unblock the Notifications